అమెరికా సైంటిస్టుల ఘనత.. ఒక్క సెకనులోనే కరోనా టెస్టు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ సైంటిస్టులు లాలాజలం ద్వారా కరోనా వైరస్‌ ఉనికిని కనుగొనే వినూత్న సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీంతో అత్యంత వేగంగా కరోనా పరీక్షలు చేయవచ్చని వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్టు ద్వారా కరోనాను నిర్ధారించేందుకు కొన్ని గంటలు లేదా రోజుల సమయం పడుతోంది. అయితే అమెరికా సైంటిస్టుల సాధనంతో సెకనుల్లోనే కరోనా వైరస్‌ను కనిపెట్టవచ్చని తెలుస్తోంది.

సాధారణంగా కరోనా బాధితుడి నుంచి నుంచి సేకరించిన నమూనాలో కరోనాను గుర్తించాలంటే దాని ఆనవాళ్లను పట్టించే జన్యు పదార్థం వంటి బయోమార్కర్ల పరిమాణాన్ని పెంచాల్సి ఉంటుంది. దీన్ని పీసీఆర్ విధానంతో చేయాలి. లేదా లక్ష్యంగా ఎంచుకున్న బయో మార్కర్‌ను పరీక్ష సాధనం అంటుకున్నప్పుడు వెలువడే సంకేతాన్ని పెద్దగా చేయాలి. తాజా పరీక్షలో అమెరికా శాస్త్రవేత్తలు రెండో విధానాన్ని ఎంచుకున్నారు. దానికి సాంకేతికతను జోడించారు. ఈ సాధనంలో సెన్సర్ పట్టీ, సర్క్యూట్ బోర్డు ఉంటాయి. సెన్సర్ పట్టీ అంచుల్లో చిన్నపాటి సూక్ష్మ ద్రువ మార్గాలు ఉంటాయి.

ఇందులో లాలాజల నమూనాను స్పృశించేలా కొన్ని ఎలక్ట్రోడ్లను అమర్చారు. వాటిలో ఓ ఎలక్ట్రోడ్‌కు బంగారు పూత పూశారు. లాలాజలంలో కోవిడ్ సంబంధ యాంటీబాడీలు ఉంటే అవి బంగారు పూత ఉపరితలానికి అతుక్కుంటాయి. ఈ సెన్సర్ పట్టీలను కనెక్టర్ ద్వారా సర్క్యుట్ బోర్డుకు సైంటిస్టులు అనుసంధానించడంతో యాంటీబాడీలతో కూడిన బంగారు ఎలక్ట్రోడ్‌కు మరో ఎలక్ట్రోడ్‌కు మధ్య స్వల్ప స్థాయి కరెంట్ ప్రవహిస్తుంది.

ఆ తర్వాత కరెంట్ సంకేతం సర్క్యూట్ బోర్డును చేరుతుంది. అందులోని ట్రాన్సిస్టర్ సంకేత పరిమాణాన్ని పెంచుతుంది. అంతిమంగా ఒక సంఖ్య రూపంలో అది స్కీన్‌పై ప్రతిబింబిస్తుంది. నమూనాలోని వైరస్ తీవ్రతను బట్టి ఈ సంఖ్య ఆధారపడి ఉంటుంది. దీని ఆధారంగా కరోనాను నిర్ధారించవచ్చు. తక్కువ ఖర్చులో ఈ కరోనా పరీక్షను చేసుకోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *