ఏపీలో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ ..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఏపీలో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్లీ తెల్లారేంత వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇదే సమయంలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉదయం ఆరు నుంచి 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచిన సమయంలోనూ 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. అంటే, ఐదుగురికి మించి గుమిగూడడానికి వీల్లేదు. ఏపీలో ఇప్పటికే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. రేపటి నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలను రెండు వారాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అయితే, మధ్యాహ్నం 12 గంటల తరువాత అత్యవసర సేవలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఏపీలో ప్రమాదకర స్థాయిలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 20వేలకు పైనే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. చాలా చోట్ల బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో డిశ్చార్జ్ డ్రైవ్ చేపట్టారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న కేంద్రాల్లో ఆరోగ్యం బాగున్న వారికి పరీక్షలు నిర్వహించి.. డిశ్చార్జ్ చేయనున్నారు. వైద్యం అవసరమైన వారిని మాత్రమే ఆస్పత్రిలో ఉంచుతారు. దీనివల్ల బెడ్ల కొరతను అధిగమించవచ్చని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. మొత్తానికి రోజులు 20వేలకు పైగా కేసులు వస్తుండడంతో జగన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలను కూడా వాయిదా వేసింది.

పాక్షిక కర్ఫ్యూ, ఆ తరువాత తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ క్యాబినెట్‌ ఇవాళ సమావేశం కాబోతోంది. రోజువారి కరోనా కేసులలో పెరుగుదల, వ్యాక్సినేషన్, ఆక్సిజన్‌ నిల్వలపై ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. జనజీవనానికి ఇబ్బంది లేకుండా పాక్షిక కర్ఫ్యూ అమలు చేయడంపైనా క్యాబినెట్‌ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. నిన్న కరోనా నియంత్రణ పరిస్థితులపై మంత్రులు, ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో సమీక్ష జరిపారు. పాజిటివ్‌ వచ్చిన వారి ప్రాథమిక కాంట్రాక్టును గుర్తించి వారికీ పరీక్షలు నిర్వహించాలని, ఆస్పత్రుల్లో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *