ఎన్నికలు బహిష్కరిస్తున్నా-చంద్రబాబు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలంటే టీడీపీకి భయంలేదన్నారు. ప్రజా కోర్టులో అధికార పార్టీని దోషిగా నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోకపోడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ స్థాయిలోనూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమాలు జరిగిన ఎన్నికలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కరోనా కారణంగా ఎన్నికలు వద్దని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెబితే తప్పుపట్టారని, ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని, ఎన్నికలు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముందు నుంచే యోచిస్తోంది. దీనిపై శుక్రవారం  ఆ పార్టీ అత్యవసరంగా పొలిట్‌బ్యూరో, రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశాలను ఏర్పాటు చేసింది. గత ఏడాది మార్చి నెలలో జరిగిన ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నందువల్ల వాటిని రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శుక్రవారం నిర్వహించే పార్టీల సమావేశంలో కూడా ఈ డిమాండ్‌ను బలంగా వినిపించాలని టీడీపీ భావించింది. అయితే ఆ సమావేశం జరపకుండానే కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *