వచ్చే నెలలో 44 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పుతాం-కేజ్రీవాల్‌!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఢిల్లీలో కోవిడ్‌ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆక్సిజన్‌ కొరత ఏర్పడంతో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల నుండి ఆక్సిజన్‌ ట్యాంకర్లు, ప్లాంట్లను దిగుమతి చేసుకుంటోంది. దేశ రాజధానిలో వచ్చే నెలలో 44 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం తెలిపారు. ఆక్సిజన్‌ ట్యాంకర్ల కొరత ఉందని, ఈ సమస్యను తగ్గించడానికి బ్యాంకాక్‌ నుండి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. తక్షణమే వినియోగించేలా 21 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఫ్రాన్స్‌ నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎనిమిది ఆక్సిజన్‌ ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేస్తుండగా.. 36 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిలో 21 ఫ్రాన్స్‌ నుండి రాగా…మిగిలినవి స్వదేశంలోనివని తెలిపారు. గత వారం ఢిల్లీలో ఆక్సిజన్‌ సంక్షోభం ఉందని, ఇప్పుడు కొంత మేర నియంత్రించినట్లు , పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఆసుపత్రులకు ఆక్సిజన్‌ అందుతుందని, అందుకే అడ్మిషన్స్‌ కూడా తిరిగి తెరిచినట్లు చెప్పారు. కాగా, 70 టన్నుల ఆక్సిజన్‌ కూడిన తొలి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం తెల్లవారు జామున ఢిల్లీకి చేరుకుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *