ట్విట్టర్ వేదికగా మంత్రి నాని, నాగబాబు మధ్య మాటల యుద్ధం.. కారణమదేనా..?

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా బాక్స్‌ ఆఫీస్‌‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ సినిమా విడుదల మొదలు.. ఏపీలో రాజకీయ అలజడి నెలకొంది. ‘వకీల్ సాబ్‌’ విడుదల, టికెట్ ధరలకు సంబంధించి పెను దుమారం రేగుతోంది. ఇప్పటికే ఈ వ్యవాహం కోర్టులో ఉండగా.. తాజాగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వకీల్ సాబ్ సినిమాపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సినిమాను రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. సినిమా హిట్ అయినంత మాత్రాన, తిరుపతిలో గెలవలేరు అని ఎద్దేవా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ సోదరుడు.. నాగబాబు తీవ్రంగా స్పందించారు. మంత్రి పేర్ని నానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

ట్విట్టర్ వేదికగా స్పందించిన నాగబాబు.. ‘మీకు ఏం అయ్యింది నాని గారూ.. మీరు కరోనా వ్యాక్సిన్‌తో పాటు రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సింది. ఇది చాలా అత్యవసరం. ఎవరైనా మినిస్టర్ నానికి రేబిస్ వ్యాక్సిన్‌ను పంపించండి. వ్యాక్సిన్ డొనేట్ చేయానలుకునే వారు ఆయన పేరు చెబితే ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా ఫ్రీ’ అంటూ నాగబాబు ఘాటైన పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే, నాగబాబు చేసిన ఈ ట్వీట్‌కి మంత్రి పేర్ని నాని కూడా అంతేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ‘పరోపకారి పాపన్న.. నాగబాబు గారూ పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్‌కు రేబిస్ వ్యాక్సిన్ తక్షణ అవసరం. వెంటనే ఆయనను వెతికి రేబిస్ వ్యాక్సిన్ వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా రేబిస్ వ్యాక్సిన్ అవసరం అవుతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు’ అంటూ నాగబాబుకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరి ట్విట్టర్ పోరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్‌ను అమాంతం పెంచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *