తిరుపతి ఉప ఎన్నిక.. ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో నిలిచిన 28 మంది అభ్యర్థులు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ – తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది.. దీంతో.. ఫైనల్‌గా బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నిక సంఘం అధికారులు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులు గడ్డం అంకయ్య, కిరణ్ కుమార్.. ఇద్దరూ మాత్రమే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో.. ప్రస్తుతం ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు మొత్తం 34 మంది నామినేషన్లు దాఖలు చేశారు.. ఇందులో నాలుగు నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో నామినేషన్ల సంఖ్య 30కి చేరింది. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో మరో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఫైనల్‌గా 28 మంది అభ్యర్ధులు నిలిచారు.

ఇక, వీరులో ప్రధానంగా వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ, సీపీఎం అభ్యర్థి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతామోహన్ బరిలో ఉన్నారు. ఇక, ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా తేలిపోవడంతో.. తదుపరి ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించింది ఎన్నికల కమిషన్. కాగా, తిరుపతి బరిలో నువ్వా నేనా.. పైచేయి ఎవరిది… అన్నట్లు సాగుతోంది ప్రచారం. ఫలితం ఎలా ఉంటుందో కానీ… గెలుపు తమదే అన్నట్లు దూసుకుపోతున్నాయి ప్రధాన పార్టీలు.

లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులలో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఐఏఎస్‌ అధికారిణి అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. తనకు మొత్తంగా రూ. 25 కోట్ల విలువ గల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. ఇక, కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ డాక్టర్‌ చింతా మోహన్‌ తనకు ఆస్తులు లేవని ప్రకటించారు. అదే విధంగా టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పనబాక లక్ష్మి తనకు రూ. 10 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ ఎం. గురుమూర్తి తనకు రూ. 40 లక్షల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. కాగా, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఏప్రిల్‌ 17న ఎన్నికలు జరుగుతాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మే 4వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *