అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం.. స్పష్టంచేసిన టీటీడీ..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –హనుమంతుడి జన్మస్థలంపై కొంతకాలం నుంచి చర్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హనుమంతుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది. తిరుమల సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని స్పష్టంచేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు పేర్కొంది. ఈ మేరకు తిరుమల నాదనీరాజనం వేదికగా జరిగిన కార్యక్రమంలో జాతీయ సంస్కృత వర్సిటీ ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. ఇటీవల ఆంజనేయుడి జన్మస్థానంపై అన్వేషణకు టీటీడీ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. క‌మిటీలోని వేద పండితులు ప‌లుమార్లు స‌మావేశమై పలు విధాలుగా ప‌రిశోధ‌న జరిపి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలను సేక‌రించారు. హనుమంతుడి జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ జరపిందని వీసీ మురళీధర శర్మ వెల్లడించారు.

ఈ సందర్భంగా మురళీధర శర్మ పలు వివరాలను వెల్లడించారు. హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకోని పరిశోధనలు జరిపినట్లు ఆయన తెలిపారు. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించామన్నారు. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయని.. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రిగా పిలిచేవారని తెలిపారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించినట్లు వెల్లడించారు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమంతుడు ఎగిరాడని తెలిపారు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే జన్మించినట్లు చెబుతున్నాయన్నారు. ఆకాశ గంగా తీర్థం లో పన్నెండేళ్ళపాటు అంజనాదేవి తపస్సు చేసిందని.. జాపాలీ తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని మురళీధర శర్మ ప్రకటించారు. మరే ఇతర నగరంలో హనుమంతుడు జన్మించలేదని స్పష్టంచేశారు.

హంపీ విజయనగరం అంజనాద్రి కాదని.. వాలి ఏలిన కిష్కింద కావున వానర సైన్యం ఆనవాళ్లు ఉండొచ్చని అభప్రాయపడ్డారు. కానీ అవి కావని తెలిపారు. నాసిక్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర.. ఇవేవీ అంజనాద్రి కావని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, నాసిక్‌ పరిశోధకులు సహా అందరికీ ఇదే చెబుతున్నామన్నారు. 12, 13 శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని.. అన్నమయ్య కీర్తనల్లో కూడా వేంకటాచలాన్ని అంజనాద్రిగా అభివర్ణించారని పేర్కొన్నారు.

హనుమ జన్మస్థానంపై అన్వేషణకు ఏర్పాటు చేసిన కమిటీలో మురళీధర శర్మతో పాటు, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సలర్ ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉండగా.. టీటీడీ ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *