దేశంలో అరుదైన హనుమాన్ ఆలయం..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ప్రముఖ హిందూ పురాణాల్లో రామాయణగ్రంథం ముఖ్యమైంది. ఈ రామాయణంలో హనుమంతుడి పాత్ర ప్రత్యేకమైంది. శ్రీరాముడి భక్తుడిగా విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు. హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. మనదేశంలో హనుమంతుడి గుడిలేని ఊరు బహుఅరుదు.. అయితే ఎక్కువ ఆలయాల్లో హనుమంతుడు నిలబడి దర్శనమిస్తే.. కొన్ని ఆలయాల్లో కొండలు ఎత్తినట్లు.. వీరాంజనేయుడుగా, వరాల ఆంజనేయుడిగా, పంచముఖ ఆంజనేయుడిగా, మారుతిగా అభయాన్ని ప్రసాదిస్తూ వుండే స్వామి.. ఎక్కడ చూసినా నుంచునే దర్శనమిస్తూ ఉంటాడు. అయితే అందుకు పూర్తిభిన్నంగా హనుమంతుడు పడుకుని దర్శనమిచ్చే క్షేత్రం కూడా ఒకటి ఉంది. ఆ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం..!

మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ప్రసిద్ధ ఎల్లోరాకి సమీపంలో ‘ఖుల్తాబాద్’ గ్రామంలో ఉంది ఆలయం. ఇది భద్ర మారుతి ఆలయంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా శయన ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి
స్వయంభువుగా వెలిసినట్లు స్థానికుల కథనం.

లక్ష్మణుడి కోసం సంజీవిని పర్వతం తీసుకుని వచ్చే సమయంలో ఆంజనేయ స్వామి ఇక్కడ కొంచెం పడుకుని సేదదీరాదని ఒక కథ ప్రచారంలో ఉంది. అయితే మరొక కథనం ప్రకారం.. పూర్వం భద్రావతీ నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడని.. అతనికి రాముడిపై గల అమితమైన భక్తివిశ్వాసాలు. భద్రసేనుడు ఎప్పుడూ శ్రీరాముడిని భజనలతో, స్త్రోత్రాలతో కీర్తిస్తూ.. తనను తాను మైమరిపోయి ఉండేవాడనీ.. ఒక రోజు భద్రకూట్ సరోవరం వద్ద భద్రసేనుడు శ్రీరాముడి భజనలు చేస్తుండగా వినిన హనుమంతుడు అక్కడికి వచ్చి అక్కడ నాట్యం చేసి అలసిపోయి అక్కడే పడుకొని నిద్రపోయాడట.

చాలా సేపటి తర్వాత అది గమనించిన ఆ భక్తుడు, హనుమంతుడి పాదాలపై పడి, లోకకళ్యాణం కోసం, భక్తులను సదా అనుగ్రహించమని కోరాడాడట.. అంతేకాదు.. పెళ్లికాని కన్యలు నిన్ను పూజిస్తే.. అనుకూలుడైన భర్తను అనుగ్రహించమని వేడుకున్నాడట.. ఇక నీ భక్తులకు సకల శ్రేయస్సులు కలిగించేందుకు ఇక్కడే కొలువై ఉండవలసిందిగా విన్నవించుకోగా హనుమంతుడు ఆ కోర్కెను మన్నించి అక్కడే కొలువైనట్లు మరో కథనం ప్రాచూర్యంలో ఉంది.

అందుకనే ఈ ఆలయంలో హనుమంతుడు శయన ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తూంటాడు. ఈ పురాతన ఆలయాన్ని ఎందరో రాజులు దర్శించి తరించినట్లు ఆధారాలున్నాయి. మహరాజుల నుండి సామాన్య భక్తుల వరకూ అందరూ ఇక్కడి స్వామి మహిమలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే. ఇక్కడ శయన స్థితిలో ఉన్న హనుమంతుడిని పూజించిన వారికి సమస్యలన్నీ తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక పెళ్లి కానీ అమ్మాయిలూ ఈ స్వామివారిని దర్శించి పూజిస్తే.. వెంటనే మంచి వరుడితో వివాహం అంటుందని విశ్వాసం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *