సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ షిప్ ఎలా కదిలిందో ఈ వీడియో చూడండి !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ నౌక.. ఎట్టకేలకు కదిలింది. సోమవారం ఉదయం 4.30 గంటలకు ఎవర్ గివెన్ షిప్.. తిరిగి నీటిలోకి ప్రవేశించింది. దాంతో ఆ షిప్‌ను కదిలించేందుకు ప్రయత్నాలు చేసినవారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 23వ తేదీన అంటే సరిగ్గా వారం రోజుల క్రితం సూయజ్ కాలువలో భారీ కంటైనర్ షిప్ ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అది మట్టిలో కూరుకుపోవడంతో ఎటూ కదల్లేక అడ్డంగా నిలిచిపోయింది. దాంతో ఆ షిప్‌ను సరి చేయడానికి సిబ్బంది వారం రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎట్టకేలకు ఇవాళ తెల్లవారు జామున మెల్లగా కదలడం ప్రారంభం కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కంటైనర్ షిప్ కదలికలకు సంబంధించి వివరాలను కేన్ షిప్పింగ్ సర్వీసెస్ వెల్లడించింది. ఆ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కున్న ఈ నౌకను ఈజిప్టు సిబ్బంది టగ్ బోట్ల సహాయంతో సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. ప్రస్తుతం ఈ షిప్ సురక్షితంగానే ఉందని, మెల్లగా కదులుతోందన్నారు. దాదాపు 14 టగ్ బోట్ల సహాయంతో ఈ భారీ నౌకను సరి చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆసియా, యూరప్ మధ్య సురుకును రవాణా చేసే జపాన్‌ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ ఎవర్ గివెన్ సూజయ్ కాలువలో ప్రయాణిస్తుండగా.. భారీ గాలుల కారణంగా కాలువకు అడ్డంగా ఇరుక్కుపోయింది. 2,24,000 టన్నుల బరువున్న ఈ షిప్ కింద భాగం కాలువకు అడ్డంగా నిలిచి మట్టిలోకి కూరుకుపోయింది. దాంతో సూయజ్ కాలువలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ట్రాఫిక్ కారణంగా దాదాపు రోజుకు 9 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కరోనా కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్లోబల్ షిప్పింగ్ నెట్‌వర్క్‌కు ఈ ఘటన మరింత ఇబ్బందులు సృష్టించినట్లయ్యింది. ఈ షిప్ కారణంగా సూయజ్ కాలువలో 321 కిపైగా నౌకలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ షిప్‌ను కదిలించేందుకు సూయజ్ కాలువలో 20,000 టన్నులకు పైగా ఇసుకను తొలగించడం జరిగిందని రెస్క్యూటీమ్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *