ప్రపంచ చాంపియన్‌ను మట్టి కరిపించిన తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –బాక్సింగ్ చాంపియన్ నజీమ్ కైజైబేకు తెలంగాణకు చెందిన ప్రఖ్యాత బాక్సర్ నికత్ జరీన్ తిరుగులేని షాకిచ్చింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న బోస్‌ఫోరస్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో నేడు కజక్‌స్థాన్‌కు చెందిన నజీమ్‌ను చిత్తు చేసిన నిఖత్.. మహిళల 51 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరింది.

అంతకుముందు ఆమె ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో రష్యాకు చెందిన 2019 ప్రపంచ చాంపియన్ పాల్ట్‌సెవా ఎకాటెరినాను ఓడించింది. రింగ్‌లోకి దిగినప్పటి నుంచి ఉత్సాహంగా కనిపించిన నిఖత్ 4-1తో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఆమె చేతిలో ఓటమి పాలైన కైజైబే 2014, 2016లో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో జరీన్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది.

మరోవైపు, పురుషుల విభాగంలో 2018 కామన్‌వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత గౌరవ్ సోలంకి (57 కేజీల విభాగం) కూడా సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు. అయికోల్ మిజన్‌తో జరిగిన పోరులో గౌరవ్ విజయం సాధించాడు. ఇద్దరూ హోరాహోరీగా తలపడినప్పటికీ సోలంకి సాంకేతికంగా ఆధిపత్యం సాధించి 4-1తో విజయం సాధించాడు. దీంతో అతడికి కూడా కనీసం కాంస్యపతకం ఖాయమైంది. ఇక, ఇతర మహిళా బాక్సర్లలో సోనియా లాథెర్ (57కేజీలు), పర్వీన్ (60 కేజీలు), జ్యోతి (69 కేజీలు)లు క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో పరాజయం పాలై ఇంటి ముఖం పట్టారు.

టర్కీకి చెందిన హకన్ డోగన్‌తో జరిగిన బౌట్‌లో శివ థాపా (63 కేజీలు) 1-4తో ఓటమి చెందింది. సెమీఫైనల్‌లో జరీన్ టర్కీకి చెందిన 2019 ప్రపంచ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత బుజెనాజ్ చకిరోగ్లుతో తలపడనుంది. అర్జెంటినాకు చెందిన నిర్కో క్యూలోతో సోలంకి పోరాడనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *