కార్మికుల్లో కార్మికురాలై.. టీ ఆకులు కోస్తూ…!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సమయంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అసోం కాంగ్రెస్ యూనిట్ పావులు కదుపుతోంది. ఆ బాధ్యత ఇప్పుడు కొత్తతరం నేతలపై పడింది. ఈ ఎజెండాను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసోంలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. మహిళలు, కార్మికులు, రైతులను నేరుగా కలుసుకుంటూ పార్టీ సందేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా అసోంలోని బిశ్వనాథ్‌లో టీ గార్డెన్ కార్మికులతో మంగళవారంనాడు ప్రియాంక మమేక మయ్యారు. తానూ ఓ కార్మికురాలిగా మారి టీ ఆకులను కోస్తూ కనిపించారు. నుదుటికి బ్యాండ్ కట్టుకుని, వీపు వెనుక బుట్టను ఏర్పాటు చేసుకుని అందులో టీ ఆకులు వేస్తూ కార్మికులతో ముచ్చటించారు. నడుముకు ఏప్రాన్‌ కూడా కట్టుకున్నారు.

‘మీ భయాలు, కలలు అవగాహన చేసుకోవడానికి మేము ప్రాధాన్యం ఇస్తాం’ అంటూ తేయాకు కార్మికులకు ప్రియాంక భరోసా ఇచ్చారు. అనంతరం ఓ ట్వీట్‌లో తేయాకు తోటల కార్మికుల నిరాడంబరం జీవితం, వారి శ్రమను వివరించారని. దేశానికి విలువైన సేవలు అందిస్తున్నారంటూ కొనియాడారు. వాళ్లు కష్టించి పని చేసే తీరు తెలుసుకున్నానని, వాటి కుటుంబాల క్షేమసమాచారం, ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్నానని, వారు తన పట్ల చూపించిన అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తేయాకు తోటల మహిళా కార్మికులతో ప్రియాంక ముఖాముఖీ ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. అసోంలో మార్చి 27 నుంచి మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 35 సీట్లలో తేయాకు కార్మికులు ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్వాన్ని నిర్దేశించగలుగుతుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *