తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కొత్త నెల మారుతోంది.. ఖర్చులు కూడా పెరుగుతాయి.. అని ఖంగారుపడే సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లపై రూ. 10 తగ్గిస్తూ ప్రభుత్వ ఆయిల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ బుధవారం కీలక ప్రకటన చేసింది. కొత్త ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని అందులో పేర్కొంది.

“అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నవంబర్ 2020 నుండి స్థిరంగా పెరుగుతున్నాయి. భారతదేశం ఎక్కువగా ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతోంది. దీని వల్ల అంతర్జాతీయ ధరల పెరుగుదల ఆధారంగా దేశీయంగానూ చమురు ఉత్పత్తుల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.” అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

“అయితే, యూరప్, ఆసియా దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, కోవిడ్ టీకా దుష్ప్రభావాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తి ధరలు 2021 మార్చి మధ్య వారం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి” అని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది.

గత కొన్ని రోజులుగా ఢిల్లీ మార్కెట్లో చమురు కంపెనీలు డీజిల్, పెట్రోల్ రిటైల్ సెల్లింగ్ ధర (ఆర్‌ఎస్‌పి)ను లీటరుకు 60 పైసలు, లీటరుకు 61 పైసలు తగ్గించాయని ఐఓసిఎల్ తెలిపింది. అంతేకాకుండా ఇతర మార్కెట్లో సైతం పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయని స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వాహనదారులకు కాస్త ఊరటను ఇచ్చిందంది. కాగా, దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా 2021 ఏప్రిల్ 1 నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 10 తగ్గింపు లభించింది. దీనితో ఢిల్లీ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .819 నుంచి రూ .809కి తగ్గనుందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *