భారత జలాల్లోకి ఫ్రెంచ్ యుద్ధ నౌకలు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ – నాలుగు దేశాల నావికా దళాలు తమ సాహస కృత్యాలతో కనువిందు చేయబోతున్నాయి. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జరిగే సంయుక్త విన్యాసాల్లో యుద్ధ సామర్థ్యాలను ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ప్రదర్శించబోతున్నాయి. క్వాడ్ దేశాలు (భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా) కలిసి ప్రాంతీయ జలాల్లో సంయుక్తంగా నావికా దళ విన్యాసాలు నిర్వహించడం ఇదే తొలిసారి.

క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్) దేశాల నావికా దళాల విన్యాసాలకు ఫ్రెంచ్ నావికా దళం నాయకత్వం వహిస్తుంది. బంగాళాఖాతంలో ఈ విన్యాసాలు ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జరుగుతాయి. లా పెరౌజ్ శీర్షికతో జరిగే ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు రెండు ఫ్రెంచ్ యుద్ధ నౌకలు కొచ్చి నౌకాశ్రయానికి చేరుకున్నాయి. ఈ నౌకలు ఏప్రిల్ 1 వరకు కొచ్చిలోనే ఉంటాయి. టొనెర్రే అనే హెలికాప్టర్ వాహక నౌక, సుర్కౌఫ్ అనే లా ఫయెట్టే క్లాస్ ఫ్రిగేట్ నౌక వచ్చాయి. ఏప్రిల్ 1 తర్వాత ఈ రెండు నౌకలు ఇక్కడి నుంచి బంగాళాఖాతానికి వెళ్తాయి.

క్వాడ్ దేశాల అధినేతల సమావేశం మొదటిసారి మార్చి 12న జరిగిన సంగతి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండోనేషియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు వచ్చే నెలలో జరుగుతాయి.

ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఐదు నెలలు

ఫ్రెంచ్ ఎంబసీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రెండు యుద్ధ నౌకలు ఫిబ్రవరిలో బయల్దేరాయి. వీటిని ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఐదు నెలలపాటు మోహరిస్తారు. తద్వారా వ్యూహాత్మక ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మోహరించే సామర్థ్యం తనకు ఉందని ఫ్రాన్స్ చాటి చెప్తుంది. ఈ ప్రాంతంలో ప్రధాన భాగస్వాములతో కలిసి కార్యకలాపాలను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఈ చర్యలు దోహదపడతాయి. మరీ ముఖ్యంగా భారత దేశంతో కలిసి పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. మరోవైపు 148 మంది ఫ్రెంచ్ నావికా దళ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఈ మోహరింపు వల్ల అవకాశం లభిస్తుంది.

నమ్మకం, సమన్వయం గర్వకారణం

ఈ రెండు యుద్ధ నౌకలకు స్వాగతం పలికేందుకు ఫ్రెంచ్ రాయబారి ఎమ్మెన్యుయేల్ లెనైన్ కొచ్చి నౌకాశ్రయానికి వచ్చారు. భారత్, ఫ్రెంచ్ నావికా దళాలు పరస్పర నమ్మకాన్ని, సమన్వయాన్ని సాధించాయని, ఇది తనకెంతో గర్వకారణమని చెప్పారు. నూతన తరం ఫ్రెంచ్ నేవీ ఆఫీసర్స్‌కు శిక్షణ ఇవ్వడంలో భారత దేశం, ఇండో-పసిఫిక్ చాలా ముఖ్యమైనవని చెప్పారు. అనేక దేశాలు ఉమ్మడి లక్ష్యం కోసం సముద్రంలో పని చేయడాన్ని దృఢంగా ప్రదర్శించేందుకు ఏప్రిల్ 5 నుంచి జరిగే యుద్ధ విన్యాసాలు దోహదపడతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *