నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి- వెంకయ్య పిలుపు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –పరమేశ్వరన్ వంటి ఎందరో మహనీయులు చూపించిన మార్గంలో నడుస్తూ వైభవోపేతమైన భారత సంస్కృతి, వారసత్వాలను కొనసాగించాల్సిన బాధ్యత దేశ యువతపైనే ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారత సమాజాభివృద్ధికి ప్రధాన అడ్డంకులుగా మారిన కుల, లింగ వివక్ష, అవినీతిని పారద్రోలడం ద్వారా మరింత సుదృఢమైన, సంతోషకరమైన, శ్రేయస్కరమైన భారతదేశాన్ని నిర్మించాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. గురువారం తిరువనంతపురంలోని భారతీయ విచార్ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు.. పీ పరమేశ్వరన్ తొలి స్మారకోపన్యాసం చేశారు. అంతకుముందు పరమేశ్వరన్ స్మతికి నివాళులు అర్పించారు.

పరమేశ్వరన్‌ను ఓ తపస్విగా, గొప్ప మానవతావాదిగా, సామాజిక తత్వవేత్తగా రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. కేరళలో రామాయణ మాసాన్ని జరుపుకునే సంప్రదాయాన్ని మరిచిపోయిన పరిస్థితులను పరమేశ్వరన్ పునరుద్ధరించి మళ్లీ ఆ సంప్రదాయాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. రచనలు, ప్రసంగాలు, ఇతర మేధోపరమైన కార్యక్రమాల ద్వారా సమాజంతో పాటు కేరళలోని మేధావి వర్గంలో సానుకూలమైన, ఆధ్యాత్మికపరమైన జాతీయవాదం వైపు మొగ్గి మార్పు కోసం ఆయన ప్రయత్నించారన్నారు. జగద్గురు ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, స్వామి రంగనాథానంద, మాతా అమృతానందమయి వంటి గొప్ప వ్యక్తుల దార్శనికతను.. రామకృష్ణ మఠ్ వంటి సంస్థల సేవలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కేరళకు చెందిన సంఘ సంస్కర్త నారాయణ గురు తీసుకొచ్చిన మార్పులను కూడా ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. ఓ సమగ్రమైన శాస్త్రంగా, సమాజంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే కేంద్రంగా పరమేశ్వరన్‌జీ ప్రఖ్యాతిలోకి తీసుకొచ్చారన్న ఉపరాష్ట్రపతి.. యోగ-గీతల సారాన్ని కలిపి చదివే ప్రక్రియకు ‘సంయోగి’ అని కొత్త పదాన్ని సృష్టించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళిధరన్, స్థానిక శాసనసభ్యుడు ఓ రాజగోపాల్, భారతీయ విచార్ కేంద్ర జాయింట్ డైరక్టర్ ఆర్ సంజయన్ తోపాటు పలువురు విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *