అరుదైన ఘనత సాధించబోతున్న వైఎస్ కుటుంబం!

0
218

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో వైఎస్‌ కుటుంబానికి అరుదైన అవకాశం లభిస్తోంది. తండ్రి తర్వాత తనయుడు సీఎం హోదాలో బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించిన ఘనత సాధించబోతోంది వైఎస్‌ కుటుంబం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఐదు సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలును సమర్పించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సీఎం హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. బ్రహ్మోత్సవాల్లో సాక్షాత్తు బ్రహ్మదేవుడే శ్రీవారికి పూజా కార్యక్రమాలు చేస్తారని ప్రతీతి. దీంతో బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివస్తారు భక్తులు.

తిరుమలేశునికి ప్రతి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు, సేవలతో పాటు… ప్రతి మాసం మాసోత్సవాలు జరుగుతాయి. అయితే ఏడాదికి ఒక సారి జరిగే బ్రహ్మోత్సవాలకు అధిక ప్రాధాన్యత వుంటుంది. గరుడ సేవ రోజున శ్రీవారి మూలమూర్తికి కాసులు హారం, సహస్రనామ మాల అలంకరిస్తారు. అలాగే ఉత్సవమూర్తులుకు మకరకంఠి అలంకరిస్తారు. తమిళనాడు భక్తులు శ్రీవారికి గొడుగులు సమర్పిస్తారు. శ్రీవల్లి పుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించే మాలలు.. స్వామివారికి అలంకరించడం వంటివి బ్రహ్మోత్సవాల ప్రత్యేకతలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది.

1953లో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి టీటీడీ వచ్చినప్పటి నుంచి శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్ర్తాలును సమర్పించే సంప్రదాయం మొదలైంది. రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన పట్టు వస్త్రాలును గరుడ సేవ రోజున శ్రీవారికి అలంకరిస్తారు. మొదట్లో శ్రీవారికి పట్టువస్త్రాలను దేవాదాయ శాఖ అధికారులు… తర్వాత దేవాదాయశాఖ మంత్రులు సమర్పిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనే స్వయంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అప్పటి నుంచి గరుడ సేవ రోజున ముఖ్యమంత్రులు పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం మొదలైంది.

2004 నుంచి ధ్వజారోహణం రోజున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడం ప్రారంభించారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గరుడ సేవ రోజున వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుండడంతో… అదే రోజు సీఎం పర్యటన వల్ల భద్రతా పరమైన ఇబ్బందులుంటాయని అప్పట్లో వైఎస్ కు వివరించారు ఆలయ అధికారులు. దీంతో ధ్వజారోహణం రోజున శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించే సంప్రదాయం మొదలైంది. 2004 నుంచి 2008 వరకు కూడా ఐదేళ్ల పాటు అదే సంప్రదాయాన్ని కోనసాగించారు వైఎస్‌. తర్వాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్లు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రావడం విశేషం. ఈ నెల 30న సీఎం హోదాలో వైఎస్ జగన్‌ శ్రీవారికి పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు. మొత్తానికి సీఎం హోదాలో తండ్రీ-కొడుకులు బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి పట్టువస్ర్తాలును సమర్పించిన ఘనత సాధించబోతోంది వైఎస్‌ కుటుంబం.

SHARE

LEAVE A REPLY