ఆంధ్రా ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే.. ఉద్యమిస్తాం – టీఎస్‌పీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్‌రావు

0
234

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ఆంధ్రా ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే మరోమారు ఉద్యమించక తప్పదని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్‌రావు పేర్కొన్నారు. దీనికి విద్యుత్తు సంస్థల్లోని ఇంజినీర్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌లోని టీఎస్‌పీఈఏ అతిథి గృహంలో జరిగిన రాష్ట్ర సర్వసభ్వ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రా నేపథ్యం ఉన్న 1157 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి రిలీవ్‌ చేశారని గుర్తుచేశారు. ఆంధ్రా విద్యుత్తు సంస్థల మొండి వైఖరితో తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన ఉద్యోగులను వారి సొంత రాష్ట్రంలో చేర్చుకోవడం లేదని చెప్పారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన 612 మంది తమ సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఆప్షన్‌ పెట్టుకున్నా ఇప్పటివరకు తీసుకోలేదన్నారు. వారిని తెలంగాణలోని విద్యుత్తు సంస్థల్లో సర్దుబాటు చేసే ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ మరోమారు ఉద్యమం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

విద్యుత్తు సంస్థల్లోని వివిధ సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఏఈ నుంచి ఏడీఈ పదోన్నతులను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్చాలన్నారు. విద్యుత్తు సంస్థను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయానికి తలొగ్గవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ పి.సదానందం, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ కంపెనీ కార్యదర్శి బి.సామ్యానాయక్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి కె.అంజయ్య ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY