ఏటూరులో బయటపడిన ప్రాచీన బుద్ధ విగ్రహం

0
152

Times of Nellore ( Vijayawada ) – చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో క్రీస్తుశకం 14వ శతాబ్దికి చెందిన నిలువెత్తు అమితాభ బుద్ధ విగ్రహం బయల్పడింది. ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ ఇచ్చిన సమాచారం మేరకు ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ అమరావతి సీఈవో ఈమని శివనాగిరెడ్డి, అమరావతి బుద్ధ విహార్‌ కార్యదర్శి శుభకర్‌ మేడసాని శుక్రవారం విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఆరడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, అడుగున్నర మందంతో నున్నగా ఈ విగ్రహం గ్రానైట్‌ రాయితో చెక్కబడి ఉందని పేర్కొన్నారు.

పద్మపీఠంపై వజ్రాసనంలో ధ్యానముద్రలో తలపైన, వెనుక అగ్ని కేరళతో ఉన్న అమితాభ బుద్ధుని విగ్రహం బయటపడటం ఇదే మొదటి సారని, ఇంతకంటే చిన్న విగ్రహాలు గుంటూరు జిల్లా నిడమర్రు, నెల్లూరు జిల్లా కుంతూరు, తమిళనాడులోని నాగపట్నం, తిరువట్టి ఏలూరులలో బయల్పడి ఉన్నాయన్నారు. ఏటూరు గ్రామానికి చెందిన నరసింహారావు మాట్లాడుతూ గ్రామంలోని లైబ్రరీ దగ్గర పునాదుల్లో ఈ విగ్రహం రెండు ముక్కలుగా దొరికిందని, భద్రత కోసం ఉన్నత పాఠశాలకు తరలించామని చెప్పారు. వజ్రయాన బౌద్ధ శాఖకు చెందిన క్రీస్తుశకం 14వ శతాబ్దం (రెడ్డిరాజుల కాలం) చారిత్రక ప్రాధాన్యత అమితాభ బుద్ధుని శిల్పాన్ని రక్షిత శిల్పంగా ప్రకటించి కాపాడి భవిష్యత్‌ తరాల కోసం భద్రపరచాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులను శివనాగిరెడ్డి కోరారు. కార్యక్రమంలో ఉన్నం నరసింహారావు, చందు కార్తీక్‌, శుభకర్‌ మేడసానిలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY