కనిపెంచిన తల్లిని అడవిలో వదిలేశారు..!!

0
42

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవిపక్కన వదిలేశారు.  మానవత్వం మంటగలపిన ఈ సంఘటన శనివారం పలమనేరు మండలంలోని పెంగరగుంట సమీపంలో వెలుగులోకి వచ్చింది.  పలమనేరు–గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిలోని పెంగరగుంట సమీప అడవికి ఆనుకుని 90 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలిని ఎవరో వదిలిపెట్టివెళ్లారు. ఆమె ఆహారం లేక శరీరం నీరసించి, కదలకుండా పడి ఉండగా స్థానికులు గమనించి రోడ్డు పక్కనున్న కుంటిగంగమ్మ ఆలయం వద్ద వదిలిపెట్టారు. మూడు రోజులుగా రాత్రిపూట కురుస్తున్న వర్షానికి తడుస్తూనే ఉంది.

శనివారం ఈ విషయం గ్రామంలో తెలిసింది. గ్రామ వలంటీర్లు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆమెకు భోజనం, నీటిని అందించారు. వానకు తడవకుండా ప్లాస్టిక్‌ పేపర్‌తో అక్కడ చిన్నపాటి గుడెసె ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా ఉండగా ఈమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె మాట్లాడడం లేదు. కన్నవారికి ఆ వృద్ధురాలు భారమై ఇలా వదిలించుకున్నారేమోనని కొందరు భావిస్తున్నారు. కరోనా సోకిందని భావించి తమిళనాడుకు చెందిన వారు ఇక్కడ వదిలేశారా? అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై తెలుసుకున్న పలమ నేరు తహసీల్దార్‌ శ్రీనివాసులు ఆమెను పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు తరలించి వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. వృద్ధురాలికి సంబంధించిన వారి వివరాలు తెలిశాక వారికి అప్పగిస్తామన్నారు.

SHARE

LEAVE A REPLY