పవన్‌పై ఇక ఎదురుదాడే!

0
164

Times of Nellore ( Amaravati ) – జనసేన అధ్యక్షుడు పవన్ చేస్తున్న విమర్శలకు ఇక నుంచి దీటుగా బదులివ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు విమర్శనాస్త్రాలకు పదును పెడుతోంది. పవన్ చేస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ వాటిలోని డొల్లతనాన్ని బయటపెట్టేలా అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పవన్‌.. మొన్నటి వరకు ఆప్తమిత్రుడు, నిన్నటి వరకు అజ్ఞాతవాసి, ఇప్పుడిక బద్ధ శత్రువే. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తరచూ చేస్తున్న ఆరోపణలను ఇప్పటివరకూ ఆచితూచి మాత్రమే స్పందిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ.. ఇకపై తీవ్రంగా తిప్పికొట్టనుంది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా సాగడంతో.. పవన్‌కల్యాణ్ అప్పుడప్పుడూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా తెలుగుదేశం నాయకులు అంతే ఘాటుగా స్పందించడం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పవన్ ఆరోపణలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఇకపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. వైకాపాపై ఏ స్థాయి విమర్శలు చేస్తున్నామో అదే స్థాయిలో జనసేనపై విరుచుకుపడాలని అధిష్ఠానం నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌ పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం పై తెలుగుదేశం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని పవన్.. తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని అధినాయకత్వం నేతలను ఆదేశించింది.

SHARE

LEAVE A REPLY