విద్యార్థులతో నకిలీ నోట్ల చలామణి…రూ.34.8 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

0
581

TimesOf Nellore (Hyderabad)- తీగ లాగితే నకిలీ నోట్ల ముఠా మొత్తం కదిలింది. ఓ కళాశాల క్యాంటీన్‌లో విద్యార్థి ఇచ్చిన రూ.రెండు వేల నోటు నకిలీదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. రూ.34.8 లక్షల నకిలీనోట్లను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి కథనం ప్రకారం బోయిన్‌పల్లికి చెందిన విజయ్‌శర్మ (40), అతని మిత్రుడు మోతేశాంఅలిఖాన్‌(45) వ్యాపారంలో నష్టపోయారు. దీంతో జిరాక్స్‌, స్కానర్‌ను కొని రూ. 35 లక్షల విలువ చేసే రూ.2వేల నకిలీ నోట్లను ఒకే నెంబర్‌తో తయారు చేశారు. వీటి చెలామణికి విద్యార్థులను ఎంచుకున్నారు. హిమాయత్‌సాగర్‌లోని లార్డ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న వాజిదుద్దీన్‌ఖాన్‌ (20), ఇతని మిత్రుడు టోలిచౌకిలోని అబ్దుల్‌ సమద్‌(20) నకిలీ నోట్ల చలామణికి విజయ్‌శర్మతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాజిదుద్దీన్‌ తన కళాశాల క్యాంటీన్‌లో మిత్రుడితో కలిసి ఈనెల 8న బుధవారం సాయంత్రం తినుబం డారాలు తీసుకొని రూ.2వేల నోటు ఇచ్చాడు. కొంతసేపటికి అబ్దుల్‌ సమద్‌ మరికొన్ని తినుబండారాలు తీసుకుని మరో రూ.2వేల నోటు ఇచ్చాడు. ఇద్దరూ ఇచ్చిన నోట్లపై ఒకే నంబర్‌ ఉండటంతో క్యాంటీన్‌ యజమాని అవి నకిలీవని గుర్తించి, ఎస్‌ఓటీతో పాటు రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాజిదుద్దీన్‌, అబ్దుల్‌ను విచారించగా అసలు విషయం బయటపెట్టారు. వెంటనే మోతేషాం అలీఖాన్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద రూ.24 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోయిన్‌పల్లిలోని విజయ్‌శర్మ ఇంటిపై సోదాలు జరిపారు. మొత్తం రూ.34.8 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

SHARE

LEAVE A REPLY