ఆగని సెగ… రాజధాని కోసం భూములు ఇస్తే బూటు కాలుతో తన్నిన వైసీపీ ప్రభుత్వం

0
32

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో నిరసనల హోరు కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయం పై రాష్ట్ర వ్యాప్త వ్యతిరేకతను ముఖ్యమంత్రి కనీసం గమనించట్లేదు అంటూ మందడం రైతులు మండిపడుతున్నారు. పాలనకు అవసరమైన అన్ని భవనాలు ఉన్న అమరావతి నుంచి రాజధాని తరలింపు నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టెనని మండిపడుతున్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా మహిళలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తాడికొండ నుంచి వందలాది మంది మహిళలు ట్రాక్టర్లపై తుళ్లూరు చేరుకుని అక్కడి నుంచి వెలగపూడి, మందడం వరకు ర్యాలీగా తరలి వచ్చారు. మూడు రాజధానులు వద్దు ఓకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఉద్దండరాయునిపాలెంలో కాలభైరవ యాగం చేసిన శివస్వామికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

నెలకు పైగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపి రైతుల ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు.రాజధాని రైతుల పోరులో వారు ఒంటరి కాదని ఉద్యమంలో పాల్గొనేందుకు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినట్లు విద్యార్థులు, మహిళలు చెప్పారు. రాజధానికి భూములిచ్చిన ప్రజలతో బిల్లుల పై చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై లేదా అని నిలదీశారు. విజయవాడ పరిధిలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో గన్నవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజధాని అభివృద్ధి సహా విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చామని రైతులు వాపోయారు. రాజధాని తరలిపోతే తమ త్యాగాలు వృధా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం పునరాలోచించే వరకు వెనుకడుగేసే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు.

SHARE

LEAVE A REPLY