కేరింతలు, జగన్‌ నామస్మరణతో మార్మోగిన బ్రిడ్జి

0
156

Times of Nellore ( Rajahmundry ) – ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం సాయంత్రం జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉదయం గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు తన విడిది ప్రాంతమైన టీటీడీ కల్యాణ మండపం నుంచి బయలుదేరారు. అప్పటి వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం నిరీక్షించిన యువత, మహిళలు ఆయన్ను చూడగానే కేరింతలు కొట్టారు. రోడ్డు కం రైల్‌ బ్రిడ్జి నుంచి రాజమహేంద్రవరం వైపునకు పాదయాత్ర కొనసాగింది.

బ్రిడ్జి ఊగింది.. యువత పులకించింది..
కొవ్వూరు వైపు నుంచి పాదయాత్ర బ్రిడ్జిపైకి కొద్దిదూరం రాగానే బ్రిడ్జి ఊగింది. మహిళలు, పెద్దలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ప్రజలు మరింతగా బ్రిడ్జిపైకి రాకుండా కొద్దిసేపు బ్రిడ్జి ప్రారంభంలో నిలువరించి వదిలారు. మధ్య మధ్యలో బ్రిడ్జి ఊగుతుండడంతో పోలీసులు నడిచే వారిని బ్రిడ్జిపై ఎక్కడికక్కడ నిలువరించారు. పెద్దలు, మహిళలు ఎక్కడికక్కడ నిలిచినా.. యువత నడక ఆపకుండా కొనసాగించింది. మహిళలు, పిల్లలు ఆందోళన చెందుతుండగా యాత్ర వెనుక జన సమూహంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధైర్యం చెప్పారు. బ్రిడ్జిపై రైళ్లు పోతున్నా ఊగుతుంటుందని వివరించారు. వైబ్రేటెడ్‌ బ్రిడ్జి గురించి తెలిసిన యువత ఎక్కడికక్కడ తోటివారికి వివరిస్తూ ముందుకు సాగారు.

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు, పోలీసుల వాహనాలు ఊగాయి. ఆ దృశ్యాలను యువకులు తమ ఫోన్లలో బందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టారు. కొంత మంది యువకులు బ్రిడ్జి జాయింట్ల వద్ద ఊగుతున్న వైనాన్ని ఫోన్లలో బంధించారు. ప్రారంభంలో ఒకటి రెండుసార్లు ఆందోళన చెందిన ప్రజలు తర్వాత కూడా పలుమార్లు బ్రిడ్జి ఊగినా లెక్కచేయకపోగా మరింత ఉత్సాహంతో నడక సాగించారు. ‘జగన్‌ దెబ్బ.. బ్రిడ్జి అబ్బ’.. ‘బ్రిడ్జి ఊగింది.. బాబు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి..’ ‘కాబోయి సీఎం జగన్‌’.. అని నినాదాలు చేస్తూ యువత కేరింతలు కొట్టింది. భారీ సంఖ్యలో బ్రిడ్జిపైకి జనం రావడంతో కిక్కిరిసింది. నడకలో ఒకరి కాలు ఒకరికి తాకుకునేలా పాదయాత్ర సాగింది. ఫలితంగా బ్రిడ్జిపై భారీ సంఖ్యలో తెగిపోయిన చెప్పులు దర్శనమిచ్చాయి. బ్రిడ్జిపై గంటా 45 నిమిషాల పాటు పాదయాత్ర సాగింది.

SHARE

LEAVE A REPLY