కరోనా కలకలం…గాంధీలో గందరగోళం…సర్కారు సీరియస్‌!!

0
92

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-ప్రపంచవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న కరోనా వైరస్ కారణంగా…ప్రతిష్టాత్మక గాంధీ ఆస్పత్రిలో కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా వైద్యులు, అధికారులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు, డాక్టర్ల మధ్య తరచూ గొడవలు జరగడం, ఓ వైద్యుడు ఆత్మహత్యాయత్నం చేయడం, ఆ తర్వాత పరస్పర ఆరోపణలతో వర్గ విభేదాలు రచ్చకెక్కడం…ప్రభుత్వాన్ని సైతం ఇరకాటంలో పడేసేంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గాంధీ ఆస్పత్రి విభాగాధిపతులు, పాలనా యంత్రాంగంతో సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే, ప్రభుత్వం మరింత సీరియస్‌గా ఈ విషయాన్ని గమనిస్తున్నట్లు సమాచారం. ఇవాళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు.

గాంధీ ఆస్పత్రిలో గత 10 రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.. కరోనా వ్యవహారంతో సస్పెండ్ అయిన డాక్టర్ వసంత్.. సంచలన ఆరోపణలు చేశారు. ఇన్‌టెన్‌షిప్ పూర్తి చేయకుండానే డబ్బులు వసూలు చేసి సర్టిఫికెట్లు ఇస్తున్నారని, సిబ్బంది అంతా విధులకు హాజరుకాకపోయినా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో…శుక్రవారం సూపరింటెండెంట్‌ శ్రావణ్ సమీక్షా సమావేశంలో నిర్వహించి డాక్టర్‌ వసంత్‌ చేసిన ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ… గాంధీ పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని, వసంత్‌ ఆరోపణలు నిరాధారమైనవన్నారు. మందుల దుకాణాలు, క్వాంటీన్ల నుంచి వసంత్‌ డబ్బు డిమాండ్‌ చేశారని.. వారి దగ్గర ఉన్న ఆధారాలతో వసంత్‌పై ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఆరోపణలు పట్టించుకోవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి డాక్టర్‌గా పనిచేస్తే అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మానసిక వైద్యులు కౌన్సెలింగ్‌ ఇచ్చిన తర్వాతే ఉద్యోగంలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

మరోవైపు, వసంత్‌కు మెడికల్ జేఏసీ మద్దతుగా నిలిచింది. వసంత్‌ చేసిన ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని, ఆయనకు తిరిగి గాంధీలో పోస్టింగ్‌ ఇవ్వాలని మెడికల్‌ జాక్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుని తగు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

SHARE

LEAVE A REPLY