ఇంటర్‌లో గ్రేడింగ్‌…!

0
743

Times of Nellore ( Amaravathi ) – ఇంటర్మీడియట్‌లోనూ గ్రేడింగ్‌ విధానం అమలు కానుంది. పదో తరగతి తరహాలో ఇంటర్‌లోనూ ర్యాంకులకు బదులు గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. సమీక్ష అనంతరం గంటా విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్‌ కళాశాలల తీరుపై చక్రపాణి కమిటీ నివేదిక, సిఫారసులపై ఉన్నత విద్యాశాఖ అధికారులు, కమిటీ సభ్యులు, డీజీపీ, కాలేజీ యాజమాన్యాలతో చర్చించామన్నారు. ప్రైవేటు కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులను 18 గంటలపాటు చదివిస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నట్లు చక్రపాణి కమిటీ గుర్తించిందన్నారు. చదువు సమయాన్ని తగ్గించి, విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు శారీరక వ్యాయామాలకు ప్రాధాన్యమివ్వాలని యాజమాన్యాలను ఆదేశించామన్నారు.

అనుమతి లేకుండా నడిచే 158 కళాశాలలను గుర్తించామన్నారు. వారు అనుమతి తీసుకునేందుకు మూడు నెలల గడవు ఇచ్చామని, ఆ గడువు ఇంకో నెలరోజుల్లో ముగుస్తుందని మంత్రి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే కళాశాలలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు ప్రైవేటు కళాశాలల్లో 35మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వీరిలో ఎక్కువ మంది చైతన్య, నారాయణ కళాశాలలకు చెందిన విద్యార్థులున్నారన్నారు.

పిల్లలను మార్కులు పొందే యంత్రాల్లా చూడొద్దని తల్లిదండ్రులకు హితవు పలికారు. ఆదివారం కచ్చితంగా విద్యార్థులకు చదువు నుంచి మినహాయింపు ఇవ్వాలని, స్టడీ అవర్స్‌ పెడితే సహించేది లేదని యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కాలేజీలను కర్మాగారాలుగా మార్చొద్దని కోరారు. విద్యార్థుల మానసిక స్థితిని పరీక్షించేందుకు కాలేజీల్లో సైకియాట్రి్‌స్టలను నియమించాలని ఆదేశించారు. కళాశాలల్లో విద్యార్థులు, అధికారులు, యాజమాన్యాలు, సోషల్‌వర్కర్లతో కమిటీలు ఏర్పాటు చేసి, ప్రతి మూడు నెలలకు కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు గంటా వెల్లడించారు. కాలేజీల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఈ కమిటీలు పరిశీలిస్తుంటాయన్నారు.

తాను విశాఖపట్నంలో శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలను, వాటి హాస్టళ్లలో పరిస్థితులను పరిశీలించి, విద్యార్థుల ద్వారా వారి సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. కొన్ని కాలేజీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలిపారు. హాస్టళ్లలో ప్రతి రోజూ తెల్లవారు జామున 4.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యార్థులకు తరగతులు, అధ్యయన తరగతులను నిర్వహిస్తున్నారని, దీంతో వారికి విశ్రాంతి లేకుండా ఒత్తిడి పెరుగుతోందన్నారు. నలుగురు ఉండాల్సిన గదిలో ఏడెనిమిది మందిని ఉంచుతున్నారని అన్నారు. మరుగుదొడ్లు తగినన్ని లేవని చెప్పారు. మనిషికి చదువు తప్పనిసరని, అయితే అదే జీవితం కాదన్నారు. విద్యార్థి సామర్థ్యానికి మించి వారికి ఐఐఐటి, నీట్‌ వంటి కోచింగ్‌ ఇస్తున్నారని, దానితో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.

కాలేజీ యాజమాన్యాల వైఖరి మారాలని, ఇక ముందు ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకూడదన్నారు. కాగా, విద్యార్థులను వత్తిడికి గురి చేయవద్దని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను కోరినట్లు డీజీపీ సాంబశివరావు చెప్పారు. విద్యార్థులను ఒత్తిడి చేసి, చదివించడం వల్ల వారు ఆత్మహత్యలు చేసుకుంటే కళాశాలకే చెడ్డపేరు వస్తుందని చెప్పామన్నారు. మంత్రితో జరిగిన సమావేశంలో అధికారులు, కళాశాలల యాజమాన్యాలు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

SHARE

LEAVE A REPLY