వేగం పెంచండి.. పురోగతి కనిపించాలి…

0
531

Times of Nellore ( Amaravathi ) – రాజధాని అమరావతిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులు వేగంగా మొదలు పెట్టాలని ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపికైన సింగపూర్‌ సంస్థల కన్సార్టియంకి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వచ్చే గణతంత్ర దినోత్సవానికి భారతదేశ అతిథిగా సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ హూంగ్‌ వస్తున్నారని, ఆయన అమరావతిని కూడా సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. ఆయన వచ్చే సమయానికి స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులకు సంబంధించి మంచి పురోగతి కనిపించాలని స్పష్టంచేశారు. అవసరమైన ప్రక్రియలన్నీ దాదాపుగా పూర్తయ్యాయని, అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని సింగపూర్‌ కన్సార్టియం ముఖ్య కార్యనిర్వహణాధికారి బెంజమిన్‌ యాప్‌ తెలిపారు. విజయవాడలో త్వరలోనే కార్యాలయం ప్రారంభిస్తున్నామని, అమరావతిలోను ప్రాజెక్టు ఆఫీసు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. పాఠశాలల ఏర్పాటుకు 8 సంస్థలకు స్థలాలు.. అమరావతిలో అంతర్జాతీయ, జాతీయ పాఠశాలల ఏర్పాటుకి 8 సంస్థలకు 46 ఎకరాల స్థలం కేటాయించారు. కొన్ని సంస్థలు రెండింటినీ నెలకొల్పుతుండగా కొన్ని ఒకదానిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. స్కాటిష్‌ హై ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు 7 ఎకరాలు, చిన్మయ మిషన్‌ కు 3, ద హెరిటేజ్‌ స్కూల్‌కు 6, సద్భావన వరల్డ్‌ స్కూల్‌కు 4, రియాన్‌ గ్లోబల్‌ స్కూల్‌కు 7, పోదార్‌ స్కూల్‌కు 7, గ్లెండేల్‌ అకాడమీకి 8, జీఐఐఎస్‌ స్కూల్‌కు 4 కేటాయించారు. అమరావతిలో ఎక్కువ బోర్డింగ్‌ స్కూళ్లు వచ్చేలా ప్రోత్సహించాలని అప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉండి చదువుకోగలరని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సింగపూర్‌కి 123 మంది రైతులు: సింగపూర్‌ పర్యటనకు దరఖాస్తు చేసుకున్న 123 మంది రైతుల్నీ పంపించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదట 100 మందినే లాటరీ ద్వారా ఎంపిక చేసినా, మిగతా 23 మందినీ నిరాశపరచకుండా సింగపూర్‌ పంపించాలని సీఎం సూచించారు. దీనికి అదనంగా రూ.12 లక్షల నిధులు మంజూరు చేశారు. ‘సాధికారత దిశగా రాజధాని రైతు’ అన్న విధానంతో యాత్ర నిర్వహించాలని సీఎం సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న తన ఆలోచన సాకారం చేయడానికి కార్య ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాజధాని అభివృద్ధికి సమాంతరంగా రైతుల అభివృద్ధి జరగాలన్నారు. ‘‘రాజధాని గ్రామాల్లోని వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికుల సమగ్ర వివరాలు సేకరించాలి. వారిని చిన్న చిన్న బృందాలుగా చేసి నైపుణ్య శిక్షణ, వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించాలి. కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీకి బాధ్యతలు అప్పగించండి’’ అని సీఎం ఆదేశించారు.

SHARE

LEAVE A REPLY