వైభవంగా చినవెంకన్న కల్యాణం

0
223

Times of Nellore (Westgodavari) – పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి తిరు కల్యాణమహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్వామి, అమ్మవార్లను వేర్వేరు వాహనాలపై ఉంచి విశేషంగా అలంకరించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయం మెట్ల వద్ద ఉన్న కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. పచ్చిపూలతో సుందరంగా తీర్చిదిద్దిన మండపంలో స్వామి అమ్మవార్లను కల్యాణ మూర్తులుగా కొలువుదీర్చారు. పండితులు వేద మంత్రాలు చదువుతూ ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర క్రతువులను శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి దివ్య కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం సింహవాహనంపై, రాత్రి కల్యాణోత్సవం అనంతరం వెండి గరుడ వాహన సేవలు వైభవంగా జరిగాయి.

SHARE

LEAVE A REPLY