కాంగ్రెస్ కురువృద్ధుడు రోశయ్య రాజకీయాలకు స్వస్తి….

0
870

Times Of Nellore ( Guntur) – మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి శేషజీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. తమిళాడు గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత తొలిసారిర ఆయన మంగళవారం గుంటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యుడు చదలవాడ రాంబాబు నివాసంలో ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.గవర్నర్ పదవి అత్యంత బరువు బాధ్యతలతో కూడుకున్నదని రోశయ్య అభిప్రాయపడ్డారు. కీలక సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అవి అధికార పార్టీ పరిధిలోకి వస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం ఒత్తిడి తెచ్చి ఏదైనా గౌరవప్రదమైన స్థానం ఇచ్చినప్పటికీ వయసు సహకరించని కారణంగా తాను బాధ్యతలు మోయలేనని రోశయ్య చెప్పారు. రాజకీయంగా మిత్రులు, సన్నిహితులు, బంధువులతో శేషజీవితాన్ని గడపాలనేది తన ఆకాంక్ష అని ఆయన చెప్పారు.

గవర్నర్ల వ్యవస్థ కొనసాగాల్సిందేనని రోశయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్ అనుసంధానకర్తగా వ్యవహరిస్తారని చెప్పారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు, బలనిరూపణ, వివిధ క్లి,ష్టపరిస్థితుల్లో గవర్నర్ల పాత్ర కీలకమని ఆయన చెప్పారు. గవర్నర్లు ఎలా వ్యవహరించాలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం కీలకమైన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రోశయ్య పనిచేశారు. ఆయన కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఆయన 1933 జులై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు.

SHARE

LEAVE A REPLY