వైకాపాకు 6నెలల టైమ్‌ ఇద్దామనుకున్నాం..

0
127

Times of Nellore (Amaravati) #కోట సునీల్ కుమార్ #-  పార్టీ కార్యకర్తలపై వైకాపా దాడులను ప్రజల్లో ఎండగట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు నేతలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసన మండలి సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. శాసనసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా మండలిలో తెదేపాకే బలముందని.. ప్రజాసమస్యలపై గట్టిగా పోరాడాలని చంద్రబాబు సూచించారు. తెదేపా నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తారని, అన్నీ ఎదుర్కోవాలన్నారు.
తొలుత 6 నెలల సమయం ఇద్దామని అనుకున్నామని.. కానీ తెదేపా కార్యకర్తలను భయపెట్టడం, దాడులకు పాల్పడటం వంటివి చేస్తుంటే మౌనంగా ఉండలేమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీపై, నాయకులపై అవినీతి బురద చల్లితే వెంటనే తిప్పికొట్టాలన్నారు. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని నేతలకు ఆయన సూచించారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలను విశ్లేషించాలని, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు శాసనసభలో తెదేపా ఉపనేతలపేర్లను కూడా చంద్రబాబు ఖరారు చేశారు. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడుకు పార్టీ ఉపనేతలుగా బాధ్యతలు అప్పగించారు. శాసనసభలో తెదేపా విప్‌గా వీరంజనేయస్వామి వ్యవహరించనున్నారు. శాసనమండలిలో తెదేపాపక్షనేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌, సంధ్యారాణి, శ్రీనివాసులు, విప్‌గా బుద్దా వెంకన్న బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

SHARE

LEAVE A REPLY