బుల్లెట్ బైక్ ల దొంగలు దొరికారు

0
57

Times of Nellore (Hyd) # కోట సునీల్ కుమార్ # – ఖరీదైన ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15లక్షల విలువైన 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు.

బీదర్‌ జిల్లా బసవ కళ్యాణం మండలం, కొడియాల్‌ గ్రామానికి చెందిన పేరినేని సందీప్‌ పాటిల్‌ బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే అతను బైక్‌ చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత ఏడాది నవంబర్‌లో జైలుకు వెళ్లిన అతను ఇటీవల విడుదలయ్యాడు. అయినా తన పంథా మార్చుకోని సందీప్‌ తన పాత స్నేహితులు విజయ్, శివశంకర్‌లతో కలిసి తిరిగి చోరీల బాట పట్టాడు.

గత రెండున్నర నెలల్లో బాలానగర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, అత్నూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 7 బుల్లెట్లు, 3 పల్సర్లు, దొంగిలించినట్లు తెలిపారు. గురువారం భాగ్యనగర్‌ కాలనీలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు నంబర్‌ లేని బుల్లెట్‌ బైక్‌పై వెళుతున్న సందీప్‌ పాటిల్, అతడి స్నేహితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో నిందితుడు విజయం పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ ప్రసన్న కుమార్, డీఐ రామకృష్ణ, ఎస్‌ఐ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY