తెలంగాణాలో మోహరించిన ఏపీ టీడీపీ నేతలు

0
492

Times of Nellore (Hyd) కోట సునీల్ కుమార్: – తెలంగాణ ఎన్నికల్లో పట్టు సాధించి, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీకి చెందిన ముఖ్య నాయకులందరినీ హైదరాబాద్‌లో మోహరించారు. టీడీపీ పోటీచేసే స్థానాలతోపాటు కాంగ్రెస్‌ నియోజకవర్గాలకు కూడా ‘దేశం’ బలగాలను తరలించారు. 40మంది ఎమ్మెల్యేలు, అనేకమంది మంత్రులు, ఎంపీలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఏపీలోని ప్రతి జిల్లా నుంచి 50–60మంది ముఖ్య నేతలను కూడా హైదరాబాద్‌కు తరలించారు. వీరు కాకుండా వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు సుమారు 200 మందిని అక్కడికి పంపించారు. మొత్తంగా ఏపీ నుంచి వెయ్యి మందిని బృందాలుగా ఏర్పాటుచేసి తెలంగాణలోని ఎంపిక చేసిన నియోజకవర్గాలకు పంపించారు. వీరందరూ కూకట్‌పల్లిలోని లాడ్జీల్లో దిగారు. కొద్దిరోజుల ముందే వీరందరికీ గుంటూరు జిల్లా మంగళగిరిలోని హ్యాపీక్లబ్‌లో ఒకరోజు శిక్షణ కూడా ఇచ్చినట్లు గుంటూరుకు చెందిన ఒక ఎమ్మెల్యే తెలిపారు. శిక్షణ సమయంలో నంద్యాల ఉపఎన్నికలో అవలంబించిన ఫార్ములాను వివరించి తెలంగాణలో ఏంచేయాలో చెప్పినట్లు ఆయన వివరించారు. శిక్షణ తీసుకున్న ఈ వెయ్యి మంది కాకుండా ప్రచారం కోసమే మరో రెండువేల మందిని ఆయా నియోజకవర్గాలకు పంపించారు. మరోవైపు.. ఏపీ నాయకులంతా తమకు పట్టున్న ఏదో ఒక నియోజకవర్గంలో కనీసం రెండురోజులు పనిచేయాలని తమకు ఆదేశాలు అందినట్లు ఒక ఎంపీ తెలిపారు.

SHARE

LEAVE A REPLY