తెలంగాణలో రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం

0
117

Times of Nellore (Hyderabad)# కోట సునీల్ కుమార్ # : తెలంగాణలో ముందస్తు ఎన్నికల రణక్షేత్రంలో కీలక ఘట్టమైన పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు ఆయా ప్రాంతాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో పాటు ఎన్నికల సరంజామాతో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంది. గత ఎన్నికలకు భిన్నంగా రాష్ట్రంలో తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో అక్కడే తెలుసుకొనేందుకు వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేయడంతో పొరపాట్లకు తావులేకుండా అధికారులు పకడ్బంధీగా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. సీసీటీవీలు, వెబ్‌ కాస్టింగ్ ‌ద్వారా పోలింగ్‌ను నిరంతరం పర్యవేక్షించేందుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పర్యవేక్షణ సెల్‌ ఏర్పాటు చేశారు. క్షణం క్షణం పోలింగ్‌ తీరును పర్యవేక్షించి ఎక్కడైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించే దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఆయా పార్టీల నుంచి 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం 55,329 ఈవీఎంలు, 39,763 కంట్రోల్‌ యూనిట్లు, 42,751 వీవీప్యాట్లు ఏర్పాటు చేసింది. 1,50,023 మంది పోలింగ్‌ అధికారులను నియమించింది. దీంతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించింది. రాష్ట్ర పోలీసులు 30వేల మంది, 18,860 మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేంద్ర బలగాలు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి.

SHARE

LEAVE A REPLY