అసెంబ్లీ సెషన్‌పై గవర్నర్ అనూహ్య నిర్ణయం!!

0
34

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ఏపీ అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేశారు. నిజానికి త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని అందరూ భావించారు. కానీ ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు కొంత బ్రేక్ తర్వాత జనవరి 20వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు కొనసాగాయి. జనవరిలో జరిగిన సెషన్‌లోనే జగన్ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, అసెంబ్లీలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందగా.. కౌన్సిల్‌కు వచ్చే సరికి ప్రభుత్వానికి చుక్కెదురైంది. టీడీపీకి వున్న ఆధిపత్యాన్ని కౌన్సిల్ వ్యూహాత్మకంగా వాడుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును కౌన్సిల్ తిప్పి పంపడంతో.. అసెంబ్లీ సమావేశాలను రెండ్రోజులు పొడిగించి మరీ.. కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.

తాజాగా ప్రోరోగ్ చేయడంలో ప్రభుత్వం రెండు అంశాలలో వెసులుబాటును కలిగించుకున్నట్లయింది. ఇందులో ఒకటి.. కౌన్సిల్ తిరస్కరించిన రాజధానుల బిల్లును ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చి.. దానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం రాజధాని తరలింపుపై ముందడుగు వేసే వెసులుబాటు కలుగుతుంది. అదే సమయంలో ప్రోరోగ్ చేయకుండా వుంటే.. త్వరలో జరిగే బడ్జెట్ సెషన్‌లో గతంలో గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం శాసనమండలిని కూడా సమావేశపరచాల్సి వచ్చేంది. తాజాగా ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో బడ్జెట్ సెషన్ కోసం విడుదల చేసే నోటిఫికేషన్‌లో కేవలం శాసనసభను మాత్రమే నోటిఫై చేసే అవకాశం వుంది. తద్వారా మండలి మనుగడలో లేదని చాటినట్లవుతుంది.

గవర్నర్ ప్రోరోగ్ నిర్ణయం వెనుక ప్రభుత్వం రెండు ప్రయోజనాలను పొందే పరిస్థితి కనిపిస్తోంది. మండలి రద్దును గవర్నర్ ద్వారా ఎండార్స్ చేయించడంతోపాటు.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు వంటి విషయాల్లో ఆర్డినెన్సు జారీ చేసుకోవడం.. ఇలా రెండు ప్రయోజనాలతో గవర్నర్ ప్రోరోగ్ నిర్ణయం జగన్ సర్కార్‌కు కలిసి వస్తుంది. ఆర్డినెన్సుల కాలపరిమితి (ఆరు నెలలు) ముగిసే నాటి మండలి రద్దును పార్లమెంటు ఎండార్స్ చేస్తే.. ఇక తదుపరి సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు వంటి ఆర్డినెన్సులను బిల్లులుగా ప్రభుత్వం మార్చేసుకుంటుంది.

SHARE

LEAVE A REPLY