రిటైర్మెంట్‌పై మౌనం వీడిన ధోనీ!

0
135

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తన రిటైర్మెంట్‌ గురించి వస్తున్న వార్తలపై ఎట్టకేలకు నోరువిప్పాడు. ‘క్రికెట్‌ నుంచి ఎప్పుడు తప్పుకుంటానో నాకు తెలియదు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే నేను రిటైర్‌ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు’ అని ధోనీ ఏబీపీ మీడియాతో అన్నాడు. అయితే ఈ విషయంలో టీమిండియా ఆటగాళ్లని కానీ, జట్టు యాజమాన్యాన్ని కానీ తాను నిందించడం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ధోనీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని.. అటు బ్యాటింగ్‌, ఇటు కీపింగ్‌ రెండిట్లో విఫలమౌతున్నాడని ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఒకవేళ జులై 14న టీమిండియా విశ్వవిజేతగా నిలిస్తే ధోనీకి అదే సరైన ముగింపు అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్‌ సెమీస్‌ చేరిన నేపథ్యంలో అటు బీసీసీఐ కానీ, ఇటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కాగా ధోనీ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 93.30 స్ట్రైక్‌రేట్‌తో 223 పరుగులు చేశాడు. ముఖ్యంగా అఫ్గాన్‌, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అతడి బ్యాటింగ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. ఇక శనివారం కోహ్లీసేన తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా ధోనీ చెలరేగితే సెమీస్‌ చేరేముందు భారత జట్టుకు కొండంత ధైర్యం చేకూరుతుంది.

SHARE

LEAVE A REPLY