తప్పును నిరూపిస్తే రాజీనామా చేస్తా … ఏసిబి విచారణ నిజమే – స్పష్టం చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే

0
2080

Times of Nellore ( Nellore ) – మహారాష్ట్రలో కాంట్రాక్టు పనులు విషయంలో తనపై ఏసిబి కేసులు నమోదు చేసిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని నెల్లూరుజిల్లా, ఉదయగిరి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు స్పష్టం చేశారు. దీనిపై ఆయన నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, వివరణ ఇచ్చారు. 2007 – 2011 సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి మహారాష్ట్ర ఎన్.సి.పి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టిందన్నారు. మొత్తం 81 పనులను, 41 సంస్థలు టెండర్ల ద్వారా దక్కించుకున్నాయన్నారు. తన కంపెనీ అయినా శ్రీనివాస సంస్థ 800 కోట్ల రూపాయల విలువైన పనులు దక్కించుకుందని వెల్లడించారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బిజేపి, పనులకు సంభందించిన టెండర్ల ప్రక్రియ సరిగా జరగలేదని ఆరోపిస్తూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పనులపై విచారణ చేయిస్తామని చెప్పిందన్నారు.

తర్వాత అధికారం చేపట్టిన బిజేపి 10 వేల కోట్ల రూపాయల పనులను రద్దు చేసి, అప్పట్లో జరిగిన టెండర్ల విధానంపై విచారణకు ఆదేశించిందని వివరించారు. అందులో భాగంగానే అన్నీ కంపెనీలతో పాటూ తమ కంపెనీ కూడా విచారణ పరిధిలోకి వచ్చిందన్నారు. అయితే తమ కంపెనీ పారదర్శకంగా పనులు చేపట్టిందని, పనుల రద్దును సవాల్ చేస్తూ తాను మహారాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించామన్నారు. అయితే గత రెండు రోజుల నుండి తనపై ఏసిబి కేసు నమోదు చేసిందని, అరెస్టు చేయబోతుందన్న రకరకాల అసత్య ప్రచారాలు వస్తున్నాయని అంటూ తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, అయితే ఏసిబి అన్నీ కంపెనీల మాదిరిగానే తన కంపెనీని కూడా విచారణ పరిధిలోకి తీసుకొచ్చారన్నారు. దీనిపై వైసిపి నేతలు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం తనకు బెస్ట్ కాంట్రాక్ట్ అవార్డు ఇచ్చిందని గుర్తు చేశారు.

SHARE

LEAVE A REPLY