మండుతున్న టపాకాయలు – అధిక ధరలతో దోపిడీ చేస్తున్న వ్యాపారులు

0
1635

Times of Nellore ( Nellore ) – బంగారం ధర అయినా అప్పుడప్పుడూ తగ్గుతుందేమో గానీ, టపాకాయల ధరలు మాత్రం తగ్గేట్లు లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టపాకాయల ధరలు సుమారు 500 శాతానికి పైగా పెరిగిపోయాయి. టపాకాయల తయారీ సంస్థలు చేస్తున్న మాయజాలం పుణ్యమా అంటూ వ్యాపారులు వాటిని అధిక ధరలకు విక్రయించి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. అధిక ఖరీదు గల టపాకాయల మాట అటుంచితే సామాన్యులు కొనుగోలు చేసే వాటిని కూడా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో పేద ప్రజలు ఇదేమి దీపావళిరా బాబూ అంటూ అప్పులు చేయక తప్పడం లేదు. వెయ్యి రూపాయలు తీసుకెళితే కనీసం క్యారీ బ్యాగ్ కు కూడా రావడం లేదు. మతాలకు అతీతంగా దీపావళి రోజు టపాకాయల పేలుస్తున్న తరుణంలో వ్యాపారులు ఇదే అదునుగా దోపిడీకి తెగబడుతున్నారు.

ఒకప్పుడు టపాకాయలు, కాకరొత్తులు, మతాబులు తదితర ప్యాకెట్లపై వాటి ధరలు ఉండేవి. అప్పట్లో టపాకాయలు తయారు చేసే కంపెనీలు ఖచ్చితమైన ధరలను వాటిపై ముద్రించేవి. అయితే ఇటీవల గత ఏడేళ్ల నుండి వ్యాపారుల నుండి కంపెనీలపై ఒత్తిడి పెరగడంతో కంపెనీలు కూడా వాటిపై దాని ధర కంటే 100 రెట్లు అధికంగా ఉండేలా రేట్లను ముద్రిస్తున్నాయి. ఇదే వ్యాపారులకు కలిసొస్తుంది. ఉదాహరణకు 20 కాకరొత్తులు ఉండే ప్యాకెట్ 50 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండదు. కానీ ఇప్పుడు గమనిస్తే దానిపై 100 నుండి 150 రూపాయల వరకూ ముద్రించి ఉంది. 20 కాకరొత్తులు, ప్యాకింగ్ తో కలిసి కంపెనీల వారికి 15 రూపాయల కంటే ఎక్కువ పడదు. అయినప్పటికి పన్నులు, వ్యాపారస్తులను దృష్టిలో ఉంచుకొని గతంలో దానికి సరిపడా ధరలను ముద్రించే వారు. కానీ ఇప్పుడు మాత్రం చిన్నచిన్న కంపెనీలు వారు వ్యాపారులకు అనుగుణంగా అధిక ధరలను వాటిపై ముద్రించి, దోపిడీకి సహకరిస్తున్నారు.

టపాకాయల గోడౌన్లు నిర్వహించే వారయితే జనంతో పాటూ కంపెనీలనే బురిడీ కొట్టిస్తున్నారు. అన్నీ రకాల టపాకాయల్లో సగానికి సగం గోడౌన్ల లోనే తయారు చేసి, వాటిని ప్యాకింగ్ చేసి, పైన స్టాండర్డ్, ఫైర్ క్రాక్, అనీల్, వినాయగ లాంటి ప్రముఖ కంపెనీల పేరుతో వీరే పేపర్స్ ముద్రించి, వాటిని ఇక్కడే అంటించి, వారికిష్టమైన ధరలను వాటిపై ముద్రింపజేస్తున్నారు. వ్యాపారుల మాయాజాలంపై సంభందిత శాఖ అధికారులెవ్వరూ స్పందించకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది. దాని ఫలితంగా సామాన్య ప్రజలు దీపావళి పండుగకు దూరం కావల్సిన పరిస్థితి ఎదురౌతుంది. నెల్లూరుతో సహా, జిల్లాలోని అన్నీ గోడౌన్లను తనిఖీ చేస్తే వారి మాయాజాలాలు బయటపడతాయి. ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి వ్యాపారులు చేస్తున్న దోపిడీని అరికట్టి వచ్చే సంవత్సరానికైనా ధరలను అదుపుచేస్తారని ఆశిద్ధాం !!

SHARE

LEAVE A REPLY