నెల్లూరుజిల్లా టిడిపిలో కుదిరిన సయోధ్య – సర్దుకున్న సోమిరెడ్డి, మంత్రి నారాయణ

0
3153

Times of Nellore ( Nellore ) – నిప్పు – ఉప్పులా ఉన్న నెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీ నేతల్లో సయోధ్య కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న సంకేతాలతో నేతలంతా ఒక్కటయ్యారు. మంత్రి నారాయణ కూడా విభేదాలు ఉన్న వారితో సర్ధుకున్నారు. ప్రస్తుతం నెల్లూరుజిల్లా టిడిపి నేతలంగా ఐక్యతా రాగం పలుకుతున్నారు. ఈ ఐక్యతకు జన చైతన్య యాత్రలు వేదికయ్యాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా మంత్రి నారాయణను అల్లీపురంలోని తన ఇంటికి ఆహ్వనించి తేనీటి విందు ఇచ్చారు. ఇతర నేతలు కూడా మంత్రితో పాటూ సోమిరెడ్డి నివాసానికి తరలివెళ్లారు.

మొదట్నుంచి నెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి ఏది చెబితే జిల్లా టిడిపిలో అదే జరిగేది. ఈ నేపద్యంలో రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల నుండి సోమిరెడ్డికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన ఓటమి చెందడం. నారాయణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ పొంగూరు నారాయణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి వర్గంలోకి తీసుకోవడం లాంటి సంఘటనలు సోమిరెడ్డి ఉనికికి కాస్త ఇబ్బందిగానే పరిణమించాయి. అప్పట్నుంచి సోమిరెడ్డి, అధినేత చంద్రబాబుపై అలకబూని నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా అడుగుపెట్టలేదు. ఆదిత్యానగర్ లో తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

మంత్రి నారాయణ కూడా జిల్లాపై పట్టు సాధించాలన్న పట్టుదలతో సోమిరెడ్డితో విభేదించారు. ఈ రెండేళ్ల నుండి సోమిరెడ్డితో అంటీ అంటనట్లుగానే వ్యవహరించారు. ఎట్టకేలకు చంద్రబాబు స్పందించి సోమిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయినప్పటికీ నారాయణను విభేదిస్తూనే వచ్చారు. అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా జిల్లాపై పట్టు పెంచుకోవాలని నారాయణకు సూచించారు. అయితే రెండేళ్లయినా మంత్రి నారాయణ ఆ విషయంలో విఫలమవ్వడంతో చంద్రబాబు మనసు మార్చుకున్నట్లు తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో జిల్లాలో పార్టీ పటిష్టం కావల్సింది పోయి, నీరసపడుతుందని ఫలితంగా వైసీపీకి నెల్లూరుజిల్లాలో గణనీయంగా ఆదరణ పెరుగుతుందని చంద్రబాబు గ్రహించారు.

ఇక చూస్తూ పోతే సరికాదని భావించిన చంద్రబాబు, జిల్లా పెత్తనాన్ని సోమిరెడ్డికే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. మంత్రి నారాయణకు రాజధాని అమరావతి నిర్మాణ పనులను అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపద్యంలో చంద్రబాబు జిల్లా టిడిపి నేతలకు క్లాస్ తీసుకున్నట్లు పలువురు తెలియజేశారు. విభేధాలు వీడి అంతా ఒక్కటిగా ఉండి, జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు తెలిసింది. మంత్రి పదవి దక్కతుందని సంకేతాలు అందిన తరుణంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి నారాయణతో సయోధ్యగా మెలుగుతున్నారు. జనచైతన్య యాత్రల నేపద్యంలో
సోమిరెడ్డి మంత్రి నారాయణతో సహా ఆనం రాంనారాయణరెడ్డి తదితరులందర్నీ తన ఇంటికి ఆహ్వానించి తేనీటి విందు ఇచ్చారు. మొత్తానికి ఉప్పు నిప్పులా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి నారాయణ ఒకే తాటిపైకి వచ్చినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

SHARE

LEAVE A REPLY