తప్పుడు కేసులు పెడ్తే బాబు ఊరుకోవాలా?జగన్‌కే భయమని సోమిరెడ్డి!!

0
776

Times Of Nellore ( హైదరాబాద్‌ ) – తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటుకు నోటు కేసుపై గురువారం స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు కేసులు పెడితే ఏపీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఊరుకోవాలా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుపై వేసిన తప్పుడు పిటిషన్లను కొట్టివేయాలని కోరే హక్కు ఆయనకు లేదా? అంటూ గురువారం ఓ ప్రకటన ద్వారా ఈ మేరకు ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై చంద్రబాబు హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ను వైసీపీ నేతలు వక్రీకరించడం దారుణమని అన్నారుమీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తనపై హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు అపీలుకు వెళ్లలేదా? ఆయన వెళ్తే న్యాయం చంద్రబాబు వెళ్తే అన్యాయమా? అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. కోర్టులంటే జగన్‌కే భయమని, ఆయనపై రెండు డజన్ల సెక్షన్ల కింద డజను ఛార్జిషీట్లు నమోదయ్యాయని ధ్వజమెత్తారు.

నాంపల్లి కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు దాకా ఆయనపై కేసులు నడుస్తున్నాయని అన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తెరిచిన పుస్తకంలాంటి చంద్రబాబు ఎవరికైనా ఎందుకు భయపడతారు? అంటూ నిలదీశారు. గతంలో వైయస్సార్ సీఎం అయ్యాక చంద్రబాబుపై 11 సభాసంఘాలు, నాలుగు న్యాయ విచారణలు, నాలుగు మంత్రివర్గ ఉపసంఘాల విచారణలు, మూడు పరిపాలనాపరమైన విచారణలు, ఒక సీబీసీఐడీ కేసు (మొత్తం 23) వేయించారని గుర్తు చేశారు. అయితే, ఒక్కదానిలోనైనా ఆరోపణ నిరూపించగలిగారా? అంటూ నిలదీశారు. అంతేగాక, చంద్రబాబు అన్నిటినీ ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకొచ్చారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

SHARE

LEAVE A REPLY