చిన్నారికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన “సింహపురి” గుండె వైద్యులు

0
1737

Times of Nellore ( Nellore ) – 9 సంవత్సరాల చిన్నారికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు సింహపురి హాస్పిటల్స్ గుండె వైద్యులు. ఆసుపత్రిలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో సంబంధిత వైద్యులు వివరాలను వెల్లడించారు. గుండె వ్యాధుల నిపుణులు డా.నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నాయుడు పల్లి గ్రామానికి చెందిన వెంకటరత్నం, రమాదేవిల కుమార్తె భవానీ శరణ్య (9) గత కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన ఆయాసంతో బాధపడుతూ, బడికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉందన్నారు. పాపకు మూడు సంవత్సరాల వయస్సులో గుండెలో రంధ్రం ఉందని గుర్తించారని, పలుచోట్ల సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. అటువంటి పరిస్థితిలో పాపను తమవద్దకు తీసుకువచ్చినప్పుడు అవసరమైన యాంజియోగ్రామ్ పరీక్ష చేయగా గుండెలో 8 మి.మీ. రంధ్రం ఉన్నట్లు ఆయన తెలిపారు. వెంటనే తగిన చికిత్స చేయకపోతే భవిష్యత్తులో పాపకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చన్నారు. ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులకు వివరించి గుండెలో రంధ్రం మూసివేయాలని నిశ్చయించామన్నారు. వెంటనే సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.విజయ్ అమరనాథరెడ్డి, కార్డియాక్ సర్జన్ డా.కృష్ణ ప్రసాద్, అనస్తీషియాలజిస్ట్ డా.రాజమోహన్ రెడ్డి లతో చర్చించి బైపాస్ సర్జరీ చేయనవసరం లేకుండా పెర్క్యుతేనియస్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ – కాలు ద్వారా గుండెకు వైర్ పంపి స్ప్రింగ్ ద్వారా రంధ్రాన్ని మూసివేయడం జరిగిందని, ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉందన్నారు. ఈ చికిత్స మొత్తం ఎన్.టి.ఆర్.వైద్యసేవ పథకం క్రింద ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.విజయ్ అమరనాథరెడ్డి, సింహపురి హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డా.పవన్ కుమార్ రెడ్డి, అనస్తీషియాలజిస్ట్ డా.రాజమోహన్ రెడ్డి, పాప భవానీ శరణ్య, పాప తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY