నెల్లూరు సింహపురి హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్

0
1402

Times of Nellore ( Nellore ) – నెల్లూరు సింహపురి హాస్పిటల్స్ లో అరుదైన గుండె ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్స్ గుండె వైద్య విభాగాధిపతి డా.చిర్రా భక్తవత్సల రెడ్డి తెలిపారు. శుక్రవారం హాస్పిటల్స్ లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గ్రిద్దలూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య (62) ఒక నెల క్రితం గుండెపోటుతో వచ్చారని, ఆలస్యంగా రావడంతో గుండె బలహీనంగా ఉందని, యాంజియోగ్రామ్ పరీక్ష చేయగా గుండె రక్తనాళంలో అడ్డంకి ఉండడంతో స్టెంట్ వేసి రక్తం ప్రసరించేటట్లు చేయడం జరిగిందని, రివ్యూకు వచ్చినప్పుడు కూడా ఆరోగ్యం బాగుందన్నారు. మళ్ళీ పదిరోజులకు ఉన్నట్లుండి రాత్రిపూట ఆయాసం రావడంతో మరలా తమను సంప్రదించారని, బ్రహ్మయ్యను పరీక్షించగా గుండెలోపల 18 మి.మీ. రంధ్రం ఏర్పడి ఉందన్నారు.

గుండెపోటు వచ్చినవారికి రక్తప్రసరణ సరిగా ఉన్నప్పటికీ చాలా అరుదుగా ఇలా గుండెలో రంధ్రం ఏర్పడుతుందని, దీనిని “వెంట్రిక్యులార్ సెప్టాల్ రప్చర్” అంటారన్నారు. ఇది ఏర్పడినప్పుడు నూటికి 95 శాతం మంది బ్రతికే అవకాశం లేదన్నారు. అయినప్పటికీ బ్రహ్మయ్య ఏ ఇబ్బంది లేకుండా హాస్పిటల్ కు రావడం జరిగిందని, ఆయాసంతో ఉండడంతో క్రొద్దిరోజులు మందులతో వైద్యం అందించామన్నారు. ఆ స్థితిలో గుండె క్రుళ్ళిపోయి రంధ్రం ఏర్పడిందని, ఈ స్థితిలో అయితే సాధారణంగా గుండె పూర్తిగా తెరిచి రంధ్రాన్ని పూడ్చవలసి ఉంటుందన్నారు. కానీ, అప్పటికే గుండెకు స్టెంట్ వేసి ఉన్నందున గుండె తెరిచి ఆపరేషన్ చేయడం చాలా ప్రమాదకరమని, ఆపరేషన్ సమయంలో అయినా ప్రమాదం జరగవచ్చని, అందువల్ల కాలు ద్వారా ఆపరేషన్ చేసి గుండె రంధ్రాన్ని మూసివేస్తే మంచిదని భావించి, రోగి కుటుంబ సభ్యులతో చర్చించి వారి సమ్మతితో ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు.

ఆపరేషన్ కు ముందు కూడా రోగి విపరీతమైన ఆయాసంతో బాధపడుతుండటంతో వెంటిలేటర్ మీద ఉంచి సాధారణ స్థితికి తీసుకువచ్చి, వెంటిలేటర్ తొలగించి ఆ తరువాత ఇంపోర్టెడ్ మెటీరియల్ తో ఈ ఆపరేషన్ ను చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ తరువాత రెండు రోజులైనప్పటికీ రోగి ఎటువంటి ఆయాసం లేకుండా సాధారణ స్థితికి వచ్చారన్నారు. ఇటువంటి ఆపరేషన్ కోస్తా ఆంధ్రలో తొలిసారిగా చేయడం జరిగిందన్నారు. ఇటువంటి సమస్యలు చాలా అరుదుగా సంభవిస్తాయన్నారు. ఇటువంటి ఆపరేషన్లకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సింహపురి హాస్పిటల్స్ లో అందుబాటులో ఉండడం వల్లనే ఇది సాధ్యమయ్యిందని, ఇందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ ఆపరేషన్ ను ఎన్.టి.ఆర్. వైద్యసేవ పధకం ద్వారా పూర్తి ఉచితంగా చేయడం జరిగిందన్నారు. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు అవసరమైనవారు తమ సేవలకు వినియోగించుకోవాలన్నారు. రోగి బంధువులు మాట్లాడుతూ తాను పూర్తిగా కోలుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. ఎన్.టి.ఆర్. వైద్యసేవ పధకమునకు రుణపడిఉంటామన్నారు. ఈ సమావేశంలో హాస్పిటల్స్ చైర్మన్ కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి, మెడికల్ డైరెక్టర్ డా.పవన్ కుమార్ రెడ్డి, ఎమర్జెన్సీ ఫిజీషియన్ డా.ప్రణీత్, ఇంటెన్సివిస్ట్ డా.నరేష్, పేషెంట్ బ్రహ్మయ్య, అతని కుమారులు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY