నేటినుంచి ఎస్2 మార్గం ఒన్ వే-కమిషనర్ పివివిస్ మూర్తి!!

0
77

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి శుక్రవారం ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక పొగతోటలోని ఎస్2 సినిమా మార్గాన్ని ఒన్ వే గా ప్రకటిస్తూ, విఆర్సీ సమీపంలోని పెట్రోల్ స్టేషన్ నుంచి విజయమహల్ గేటు వైపుగా మాత్రమే వాహనాలను నేటి నుంచి అనుమతించనున్నామని ఆయన స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ఎస్2 మార్గంలో కమిషనర్ పర్యటించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రణాళికలను అధికారులు, ట్రాఫిక్ పోలీసు విభాగం, స్థానికులు, వాహన చోదకులతో చర్చించారు. ఎస్2 మార్గంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమించిన వాహన చోదకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అనంతరం అన్నమయ్య కూడలి, ఆత్మకూరు బస్టాండు, స్టోన్ హౌస్ పేట, వేపదొరువు, చిన్న పిల్లల పార్కు, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని, పారిశుద్ధ్య పనుల నిర్వహణ మెరుగు పరచాలని అధికారులకు సూచించారు. స్థానిక జనార్ధన్ రెడ్డి కాలనీలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించి, కేంద్రంలోని వివిధ విభాగాల్లో జరుగుతున్న శుద్ధి ప్రక్రియ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం వెంకటేశ్వరపురం, రంగనాయకుల పేట, సంతపేట, చిన్న బజారు, పెద్ద బజారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో పాల్గొన్న కమిషనర్ వర్షాకాలపు సమస్యలను గుర్తించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని అధికారులు, సిబ్బందిని సూచించారు.

SHARE

LEAVE A REPLY