వారిపై క్రిమినల్ కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయండి – గోపాలకృష్ణ ద్వివేది

0
178

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ #  – జిల్లాలోని ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్‌లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఇవాళ ఆత్మకూరులో వెలుగు చూసిన వీవీప్యాట్‌ స్లిప్పులు పోలింగ్‌ రోజువి కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల కేవలం ఈవీఎంల కమీషనింగ్ సెంటర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈవీఎం కమీషనింగ్‌ సెంటర్‌లో బ్యాలెట్‌ పత్రాలు పెట్టిన తర్వాత చెక్‌ చేశారన్నారు. పోలింగ్‌కు ముందే ఒక్కో నియోజక వర్గానికి కేటాయించిన ఈవీఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్‌ చేశారని ద్వివేది స్పష్టం చేశారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాత వాటిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించారని సీఈఓ పేర్కొన్నారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా కమీషనింగ్‌ సమయంలో వేసిన వీవీప్యాట్‌ స్లిప్పులను బయట పారేశారు.

వీవీప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్‌ కేసు పెట్టి తక్షణం అరెస్ట్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఈఓ ద్వివేది ఆదేశించారు. కాగా.. ప్రతి నియోజక వర్గం పరిధిలో జరిగే తప్పులకు ఆర్వోలే బాధ్యులవుతారని ద్వివేది హెచ్చరించారు.

SHARE

LEAVE A REPLY