నెల్లూరు లో లెక్కింపునకు 1,200 మంది ఉద్యోగులు

0
169

Times of Nellore (Nellore)  #కోట సునీల్ కుమార్ #– సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా ఐదురోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఓట్లను డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించనున్నారు.

తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్కించనున్నారు. డీకేడబ్ల్యూలో ఆరు, ప్రియదర్శిని కళాశాలలో నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంట్‌కు 14 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపు కోసం పది నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 1,200 మంది ఉద్యోగులను నియమించారు.

ఉద్యోగులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 19, 20, 21 తేదీల్లో ఇస్తారు. ఎలక్ట్రానిక్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్, ఈవీఎంల్లోని ఓట్లను ఏవిధంగా లెక్కించాలో తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగులు, సిబ్బందిలో కొంతమందిని రిజర్వులో ఉంచనున్నారు. అవసరమైతే వారి సేవలను వినియోగించుకుంటారు. ఉద్యోగులు, సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు వినియోగించేందుకు అనుమతి లేదు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఇతరులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లకు పాస్‌లు ఇవ్వనున్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు.

SHARE

LEAVE A REPLY