నెల్లూరులో పట్టపగలు కిరాతకం – మహిళ హత్య, ఇద్దరికి తీవ్రగాయాలు

0
2148


Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి గల కారణాలు ఏవైనా పట్టపగలు, జనవాసాల మద్యలో జరిగిన దారుణం జిల్లా వాసులను హడలెత్తిచ్చింది. వివరాల్లో కెళ్తే …. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు సమీపంలోని సాయి నగర్‌ మూడో వీధిలో నివాసం ఉంటున్న ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లో ఆగంతుకుడు భీభత్సం సృష్టించారు. ప్రైవేటు ఆడిటర్‌గా పనిచేసే నాగేశ్వరరావు ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి ప్రవేసించిన దుండగుడు… తలుపు తీసిన నాగేశ్వరరావు భార్య ప్రభావతిపై కత్తితో దాడిచేసి గొంతుకోశారు. దీంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలింది. ఇంతలో వారి దత్త పుత్రిక మాధురి, సమీప బందువు అనంతకృష్ణలు అక్కడికి రావడంతో వారిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత తాపీగా ఇంట్లో ఉన్న నగదు, బంగారు తీసుకుంటున్న సమయంలో ఇంటికి చేరుకున్న నాగేశ్వరరావు తలుపు తట్టాడు. దీంతో ఆగంతకుడే తలుపు తీయగా… ఇంట్లోని పరిస్థితులను గ్రహించిన నాగేశ్వరరావు ఆ వ్యక్తిని ఇంట్లోకి తోసి గెడియపెట్టాడు. నాగేశ్వరరావు గెట్టిగా కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని ఆగంతుకుడికి దేహశుద్ది చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఘాతకానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాధురి, అనంత కృష్ణలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మాధురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. నాగేశ్వరరావు కుటుంబానికి సన్నిహితంగా ఉండే సర్వేపల్లి సుధ అనే మహిళ దాడి జరిగే సమయానికి ముందు ఇద్దరు వ్యక్తులను నాగేశ్వరరావు ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లుగా సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న వెంకటేశ్వర్లు నోరు తెరిస్తే కాని… హత్యకుపాల్పడింది ఒక్కరా…ఇద్దరా.. అసలు హత్యకు గల కారణాలేంటి అనే విషయాలు బయటపడాల్సి ఉంది. ఎస్పీ విశాల్‌గున్నీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు.

సంఘటనపై పలు అనుమానాలు ?
మరోవైపు ఈ ఘటనకు సంభందించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణానికి పాల్పడింది తెలిసిన వ్యక్తులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నాగేశ్వరరావు దత్త పుత్రిక మాధురి కూడా బంధువులపై అనుమానం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లును విచారిస్తే నిజాలు బయటపడే అవకాశముంది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ జరుపుతున్నారు.

కావలి, పెద్ద చెరుకూరు నిందితుడు ఇతడేనా ?
కావలి పట్టణంలో మార్చి 4వ తేదీనా పట్టపగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలతో పరారయిన నిందితుడు ఇతేనని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 2వ తేదీనా నెల్లూరురూరల్ పరిధిలోని పెద్దచెరుకూరులో అర్ధరాత్రి వృద్ధ దంపతులను హతమార్చింది కూడా ఈ వ్యక్తేనని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

SHARE

LEAVE A REPLY