మంత్రి పదవి మాగుంటకా ? సోమిరెడ్డికా ?

0
4758

Times of Nellore ( Nellore ) – దసరా పండుగ లోపు గానీ, తర్వాత గానీ మంత్రి వర్గ విస్తరణను చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తును ప్రారంభించారు. కొందర్ని మంత్రి పదవి నుండి తొలగించనుండగా, మరి కొందర్ని మంత్రి వర్గంలోకి తీసుకొనేందుకు నిర్ణయించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ కు కూడా మంత్రి పదవి ఇచ్చేందుకు అంతా సిద్ధమయిపోయింది. స్పీకర్ స్థానంలో మండలి బుద్ధప్రసాద్ ను కూర్చోబెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇక నెల్లూరుజిల్లా విషయానికొస్తే ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే నారాయణ మంత్రిగా ఉన్న తరుణంలో సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నారాయణ, మంత్రిగా జిల్లాపై తనదైన ముద్రను వేసుకోవడంలో విఫలమయ్యారని, దాని కారణంగా జిల్లాలో ప్రతిపక్ష వైసీపీ బలంగా మారిపోతుందని ముఖ్యమంత్రి ఆలోచన. ఈ నేపద్యంలో జిల్లాపై పూర్తిస్థాయిలో పట్టున్నసీనియర్ నేత సోమిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఒకే జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే సమస్యలు పుట్టుకొస్తాయన్న లోలాయమానంలో కూడా ఉన్నట్లు సమాచారం. నారాయణను మంత్రి పదవి నుండి తొలగించి, రాజధాని నిర్మాణానికి సంభందించి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామా అన్న ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే నారాయణ అందుకు ఒప్పుకోరని కూడా సమాచారం.

ఇదే తరుణంలో నెల్లూరుకే చెందిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి బెర్తు ఖారరయినట్లు పార్టీ వర్గాల నుంచి పరోక్షంగా సంకేతాలు అందాయి. మాగుంట శ్రీనివాసులురెడ్డిని ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ప్రకాశం జిల్లా కోటాలో మంత్రి పదవి ఇస్తున్నట్లు దానికి నెల్లూరుజిల్లాకు సంభందం లేదని పార్టీలోని కొందరు అంటున్నారు. సోమిరెడ్డికి అవకాశాలు తీసిపోలేదని అంటున్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి దాదాపుగా ఖరారయినట్లే నని అంటున్నారు. చివరి సమయంలో మాగుంటకు ఇవ్వకుంటే ఆ అవకాశం ఖచ్చితంగా సోమిరెడ్డికే దక్కుతుందని టిడిపిలోని ముఖ్యనేతలొకరు చెప్పారు. మొత్తానికి త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్పడంతో అశావహులు ముఖ్యమంత్రి కార్యాలయానకిి బారులు తీరుతున్నారు. ముఖ్యమంత్రి ముందు కోర్కెల చిట్టాలను విప్పుతున్నారు. చివరకు ఎవరు ఇన్ అవుతాలో ఎవరు అవుట్ అవుతారో వేచిచూడాలి మరి .

SHARE

LEAVE A REPLY