నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో విజయవంతంగా 500 మోకీలు ఆపరేషన్లు!

0
105

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒  – ఆధునిక వైద్య విధానాలతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ది బెస్ట్ హాస్పిటల్ గా పేరుగాంచిన నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మరో ఘనతను సొంతం చేసుకుంది. 2015 సంవత్సరం నుండి నేటి వరకూ 500 మోకీలు మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి మరో మైలు రాయిని అందుకుంది. చెన్నై అపోలో హాస్పిటల్ ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్యులు, సీనియర్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 500 శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా అయితే పూర్తి స్థాయి మోకీలు శస్త్ర చికిత్స చేస్తారని, దాని వల్ల వారం రోజుల పాటూ హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుందని డిశ్చార్జ్ తర్వాత కొన్ని నెలల పాటూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అయితే తాము నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 2015 నుండి ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్ మెంట్ అనే విధానాన్ని పరిచయం చేశామన్నారు. ఈ విధానం ద్వారా చేసే శస్త్ర చికిత్సలో నొప్పి లేకుండా మోకీలు మార్పిడి చేయవచ్చునని చెప్పారు. చికిత్స అనంతరం ఫిజియోథెరపి అవసరం కూడా ఉండదన్నారు. అంతే కాకుండా రోగి త్వరితగతిన కోలుకుని 3 రోజుల్లోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వవచ్చునని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తెలియజేశారు. డిశ్చార్జ్ తర్వాత ఇంటి వద్ద స్వల్ప కాలం విశ్రాంతితోనే తిరిగి సాధారణ జీవినాన్ని సాగించవచ్చునని వివరించారు.

పాత విధానం ద్వారా అయితే మోకీలు పూర్తిగా మార్పిడి చేయాలని, అయితే తాము చేసే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్ మెంట్ విధానం ద్వారా మోకీలు భాగంలో ఎక్కడ అవసరమో అక్కడే ఆపరేషన్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. త్వరలో మరో అడ్వాన్స్ డ్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామన్నారు. ఈ నూతన విధానాన్ని యూనీ కాండెలార్ అని పిలుస్తారని, చిన్న వయస్సులోనే మోకీలు అరుగుదల వచ్చిన వారికి అవసరమైన చోట మాత్రమే పాక్షిక మోకీలు మార్పిడిని ఈ నూతన విధానం ద్వారా సులభంగా చేయవచ్చునని తెలియజేశారు. ఈ నూతన శస్త్ర చికిత్స విధానంలో వాడే గోల్డ్ నీ, విటమిన్ – ఇ, ఎన్ రిచ్ డ్ పాలీ వంటి అధునాతన పరికరాలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, హాస్పిటల్ యూనిట్ హెడ్ నవీన్, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీరాం సతీష్, డాక్టరు శ్రీనివాసన్, డాక్టర్ షాహుల్, డాక్టర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY