నెల్లూరు కార్పొరేషన్ లో కరప్షన్ లొల్లి – టిడిపిలో రచ్చకెక్కిన విబేధాలు

0
3491

జూన్ 21 ( నెల్లూరు ) – జిల్లా తెలుగుదేశం పార్టీలో వలస నాయకుల వర్గ విభేధాలు రచ్చకెక్కాయి. మీరు అవినీతి పరులంతే మీరంటూ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి – నగర మేయర్ అబ్ధుల్ అజీజ్ లు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి మునిరత్నం 50వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఏసిబికి దొరికిన మునిరత్నం విచారణలో పలువురిపై అభియోగాలు మోపారు. లంచం తనకొక్కడికే కాదని, అందరికీ పంచాల్సి ఉంటుందని చెప్పడంలో ఏసిబి అధికారులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. మేయర్ సిసి, పలువురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కమీషనర్ వెంకటేశ్వర్లు పాత్రపై ఏసిబి అదికారులు విచారణ చేస్తున్నారు. ఈ నేపద్యంలో స్వపక్ష నేత ఆనం వివేకానందరెడ్డి, మేయర్ అజీజ్ పై విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్ లో పాలనను తన అవినీతితో మేయర్ అజీజ్ బ్రష్ఠు పట్టించారని, మేయర్ తమ్ముడు జలీల్ డి.ఆర్. ఉత్తమ్ హోటల్ తిష్ట వేసి లంచాలను దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి చిన్నపనికీ జనం ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నెల్లూరు కార్పొరేషన్ ను అవినీతి మయం చేసిన అజీజ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు మేయర్ పదవి నుండి తొలగిస్తారని వివేకానందరెడ్డి అన్నారు. అజీజ్ ఏమైనా నెల్లూర్ కా సుల్తానా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి నారాయణ సొంత నగరంలో అవినీతి ఏంటని ఆయన్ను ప్రశ్నిస్తే తలదిందుకోవాల్సిన పరిస్థితిని అజీజ్ తీసుకొచ్చారన్నారు. మరో వైపు ఆనం వివేకానందరెడ్డి చేసిన ఆరోపణలపై మేయర్ అజీజ్ మండిపడ్డారు. అవినీతికి మారుపేరయిన ఆనం వివేకానందరెడ్డి అవినీతి గురించి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీలు మేయర్ కావడాన్ని వివేకా జీర్ణించుకోలేకున్నారని ఎదురు దాడికి దిగారు. అవినీతి అధికారిని ఏసిబికి పట్టించిన వ్యక్తికి సలాం అంటూ ఆనం ఆధ్వర్యంలో కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. దీనిపై విచారణకు సిద్దమా అని వివేకాను అజీజ్ ప్రశ్నించారు. నగర టిడిపి అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా పరస్పర ఆరోపణలపై స్పందించారు. ఆనం వివేకానందరెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకదా అని ప్రశ్నించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రకు ఫిర్యాదు చేయాలే తప్పా ఇలా రచ్చకీడ్చడం ఏంటని ఆగ్రహం చెందారు. మరో వైపు ఒకే పార్టీలోని ఈ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకోవడంపై పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెెలిసింది. వైసీపీ నగర ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ కూడా దీనిపై స్పందిస్తూ కార్పొరేషన్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఒకే పార్టీలోని ఆనం వివేకానందరెడ్డి, మేయర్ అజీజ్ లు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

SHARE

LEAVE A REPLY