మార్గాలు మార్చి అక్రమ రవాణా – ఎర్ర స్మగ్లర్లకు అడ్డేది..?

0
782

Times of Nellore ( Atmakur ) – చెన్నై.. హైదరాబాద్‌.. కోల్‌కతా.. బెంగళూరు.. దిల్లీ.. విజయవాడ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డాలుగా చేసుకొని కార్యకలాపాలు సాగించిన నగరాలివి. ఒకదానిపై పోలీసులు దృష్టి నిలిపితే అక్కడ కార్యకలాపాలు ఆగితే మరో నగరంలో కదలికలు మొదలయ్యాయి. ఇలా ఈ కదలికలు తిరిగి చెన్నై చేరాయి. జిల్లా పోలీసులు రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలు పట్టుకొన్నపుడు చెన్నై మీదుగా రవాణా మరో మారు తెరపైకి వచ్చింది. అక్రమ రవాణాపై దాడులు అధికమయ్యే కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమ రవాణా కొనసాగుతున్న తీరును పరిశీలిస్తే..
జిల్లాలో ఈ ఏడాది ఎర్రచందనం కేసులు 29 నమోదు చేసి 160 మందిని అరెస్ట్‌ చేశారు. అయినా ఆదివారం మరో 19 మంది దొరకగా మరికొందరు పరారు అయ్యారు. ఆదివారంనాటి దాడుల్లో మరో ప్రత్యేకత నెలకొంది. ఆపిన పోలీసు అధికారులపైకి వాహనాలు నడపడం స్మగ్లర్ల బరితెగింపును చెప్పకనే చెపుతోంది. ఎర్రచందనానికి అధికంగా డిమాండ్‌ ఉండటం వల్ల ఒక లోడు తరలించినా దాని విలువ రూ.కోట్లలో ఉండటం ఇలా బరితెగించేందుకు కారణం. ఒక లోడు తరలించిన స్మగ్లర్‌ మధ్యలో పదిసార్లు పట్టుపడినా ఆర్థికంగా ఇబ్బంది పడకపోవడమే ఈ అక్రమ రవాణాకు జీవం పోస్తోంది. దానికి తోడు అక్రమ రవాణాకు పాల్పడిన వారికి బెయిలు త్వరగా రావడం.. వస్తూనే వారు తిరిగి అడవుల్లోకి వెళ్లడం ఇందుకు బాటలు వేస్తోంది.

దారులు అనుకూలం : జిల్లాలో సరిహద్దు నియోజకవర్గాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరిలకు రహదారి సౌకర్యాలు అనువుగా ఉండటం స్మగ్లర్లకు వూతం ఇచ్చేలా ఉంది. ఎర్రచందనం వాహనంపై పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం వచ్చేలోపే ఆయా మండలాల సరిహద్దులు దాటేలా ఇవి ఉండటం మరో కారణం. కొండ కింద రహదారులు, వాటికి అందుబాటులో జాతీయ రహదారులతో స్మగ్లర్లకు ఎర్రచందనం వేగంగా తరలించుకొనేందుకు అనువైన పరిస్థితి ఉంది. పోలీసులకు సమాచారం అందినవి పట్టుపడటం మినహా.. వీరికి అడ్డు లేని స్థితి సరిహద్దు ప్రాంతంలో ఉండటం ఇందుకు బాటలు వేస్తోంది.

ఇప్పటి వరకు కూలీలు, వారిని అడవులకు తరలించే మధ్యవర్తులు, సరకును నగరాలకు చేర్చే స్మగ్లర్లు, కొందరు బడా స్మగ్లర్లు మినహా అసలు సూత్రధారులు పోలీసు, అటవీ అధికారుల వలలో చిక్కనే లేదు. అందుకే ఈ స్మగ్లింగ్‌లో ఎన్ని లింకులను పోలీసులు ఛేదించినా మరో లింకు వెలుగులోకి వస్తూనే ఉంది. మొత్తానికి అక్రమ రవాణా పకడ్బందీగానే సాగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, అటవీశాఖ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను తీవ్రంగా పరిగణించి నివారణ చర్యలు తీసుకొంటుండగా దేశంలోని మిగిలిన రాష్టాలు పట్టించుకోకపోడం మరో పెద్ద సమస్య. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు దాటితే తమ పని అయినట్లే అనే స్థితి ఉండటం ఈ స్మగ్లింగ్‌ను యథేచ్ఛగా సాగేలా చేస్తోంది. ఇలా ఈ అక్రమ రవాణా ఒక నగరంలో అరికడితే మరో నగరం కేంద్రంగా కొనసాగుతోంది తప్ప ఆగింది లేదు. మూల సూత్రధారుల ఆటలు కట్టించనిదే ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేలా లేదు. ఆ దిశగా మూలాలను వెలికితీస్తారా లేక అప్పుడప్పుడు ఒకటి అర పట్టుకొని.. తరలిపోయేవి పోతూ ఉంటే ప్రేక్షక పాత్రకు పోలీసులు పరిమితం అవుతారా అనేది వేచి చూడాల్సిందే.

 ఈ క్రమంలోనే ఆదివారం ఆత్మకూరు సీఐ ఎస్‌కే ఖాజా వళి, మర్రిపాడు ఎస్సై షేక్‌  అబ్ధుల్‌ రజాక్‌ జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఛేజింగ్‌ చేసి మర్రిపాడు వద్ద వాహనా న్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఘటనలో సైతం స్మగ్లర్లు పోలీసులపై దాడులకు ప్రయత్నించడం గమనార్హం. తమిళనాడులోని పొన్నేరి, గుమ్మడిపూండికి చెందిన ఇద్దరు, వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన మరో ఇద్దరు అంతరరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు.

ఆఖరి వెలుగే ఖాజావలి, సీఐ, ఆత్మకూరు.. ఎర్రచందనం స్మగ్లర్ల్లను దాదాపు అదుపు చేశాం. గతంలో కొట్టిన దుంగలు తరలించుకొనే క్రమంలోనే పట్టుపడుతున్నారు. అంతేతప్ప కొత్తగా కొట్టడం లేదు. స్మగ్లర్లది ప్రస్తుతం ఆఖరి వెలుగే. త్వరలో పూర్తిగా అరికట్టేలా ఉమ్మడి కార్యాచరణ చేపడుతున్నాం.

SHARE

LEAVE A REPLY