వీడెంత దుర్మార్గుడో చూడండి!

0
114

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –బాలింత అని కూడా చూడకుండా మహిళను దారుణంగా రోడ్డు మీదకు ఈడ్చిపారేసిన అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. కొరియా జిల్లా జాన​క్‌పూర్‌ బ్లాక్‌లోని బార్వానీ కన్య ఆశ్రమంలో ఈ దారుణం జరిగింది. హాస్టల్‌ సూపరింటెండెంట్‌ సుమిళ సింగ్‌ భర్త రంగ్లాల్‌ సింగ్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సుమిళ సింగ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆమె స్థానంలో లీలావతి అనే మహిళను కొత్త సూపరింటెండెంట్‌గా నియమించారు.

హాస్టల్‌లో పనిచేస్తున్న ఓ మహిళ తన 3 నెలల బిడ్డతో కలిసి అక్కడే ఓ గదిలో ఉంటోంది. రూము ఖాళీ చేయాలని ఈనెల 10న ఆమెకు రంగ్లాల్‌ హుకుం జారీ చేశాడు. ఖాళీ చేసేందుకు ఆమె నిరాకరించడంతో బలప్రయోగానికి దిగాడు. మంచం మీద కూర్చున్న ఆమెను దుప్పటితో సహా కిందికి ఈడ్చిపాడేశాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని బలవంతంగా బయటకు లాక్కుపోయాడు. సుమిళ సమక్షంలో ఈ దారుణమంతా జరిగినా భర్తను ఆమె వారించకపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 11న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్‌ చేయలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, అధికార కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ఆదివారం బాధితురాలిని పరామర్శించి, ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.

SHARE

LEAVE A REPLY