ఏడు నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!!

0
111

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒కూరగాయలు, ఇతర నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో గత నెల టోకు ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. నవంబరులో 0.58శాతంగా ఉన్న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబరులో 2.59శాతానికి చేరింది. రిటైల్‌ ద్రవ్యోల్బణంలో గణనీయ పెరుగుదల, ఆహార పదార్థాల ధరలు మిన్నంటడంతో టోకు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో నవంబరులో 11శాతంగా ఉన్న ఆహార పదార్థాల ధరల పెరుగుదల రేటు 13.12శాతానికి చేరింది. ఇక ఆహారేతర పదార్థాల ధరల పెరుగుదల రేటు దాదాపు నాలుగింతలు పెరిగి 7.72శాతం పెరిగింది. ఇక కూరగాయల ధరలు 69.69శాతం పెరగడం గమనార్హం. ఇందులో అత్యధికంగా ఉల్లి 455.83శాతం, బంగాళాదుంప 44.97శాతం పెరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి.

ఇక సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరిన విషయం తెలిసిందే. ఇది అయిదున్నరేళ్ల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 2014 జులైలో నమోదైన 7.39 శాతం తర్వాత.. మళ్లీ ఇంత ఎక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. పైగా రిటైల్‌ ద్రవ్యోల్బణానికి ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 6 (4+2) శాతం నియంత్రిత లక్ష్యం కంటే కూడా ఇది ఎక్కువ. ముఖ్యంగా ఉల్లిపాయలు ప్రియం కావడం డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమైంది.

2018 డిసెంబరులో వినియోగ ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (సీపీఐ) 2.11 శాతంగా ఉండగా.. 2019 నవంబరులో 5.54 శాతంగా ఉంది. డిసెంబరులో ఆహార ద్రవ్యోల్బణ రేటు 14.12 శాతానికి పెరగగా.. నవంబరులో ఇది 10.01 శాతంగా నమోదైంది.

SHARE

LEAVE A REPLY