తన సమాధి తానే నిర్మించుకున్న మహిళ!

0
1102

Times Of Nellore ( చెన్నై ) – ఎవరికైనా చనిపోయిన తర్వాత వారిని సమాధి చేస్తారు. అయితే, తమిళనాడులోని మదురైకి చెందిన ఓ మహిళ మాత్రం తాను బతికుండగానే తన సమాధిని నిర్మించుకుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆమెది పెద్ద కుటుంబమే అయినా ఇప్పుడు ఆమె ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తాను చనిపోయిన తర్వాత తన సమాధి ఎవరూ చేయిస్తారనుకుని తానే తయారు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని సూలల్ పంచాయతీ పరిధిలోని పల్లకుజి మెలవిల్లైకు చెందిన రోజీ(55) ఆమె తల్లిదండ్రులకు ఆరో సంతానం. ఓ సోదరుడు కూడా ఉన్నాడు. వారందరికీ పెళ్లిళ్లయిపోయాయి. రోజీ మాత్రం వివాహం కాకుండా ఒంటరిగా ఉండిపోయింది. స్థానికంగా జీడి తోటల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది.

కాగా, తనకు వచ్చిన సంపాదనలో కొంత పొదుపు చేసి ఏడు సెంట్లలో ఓ గది నిర్మించుకుని అందులో ఉంటోంది. ‘నీకంటూ ఎవరూ లేరు. ఎందుకంతలా కష్టపడతావు. నీవు చనిపోయాక అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా ఎవరూ లేరు కదా’ అని ఇరుగుపొరుగువారు రోజీని ప్రశ్నించడంతో ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. వెంటనే పనిమానేసి కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ(ఎంఎన్ఆర్ఈజీఎస్)లో చేరింది. ఆ తర్వాత తాను పొదుపు చేసిన డబ్బులోంచి రూ.50వేలు తీసి తన సమాధిని నిర్మించాలనుకుంది. నెల రోజుల క్రితం సమాధి నిర్మాణ పనులు చేపట్టింది. గ్రానైట్ రాళ్లతో అందంగా సమాధిని నిర్మించుకుంది. అంతేకాదు తన ఫొటో, పేరు, వివరాలతో ఓ ఫలకాన్ని కూడా సమాధి పైభాగంలో సిలువ కింద అమర్చింది. తాను చనిపోయాక ఇందులో సమాధి చేయడం చాలా సులభమైన పని అని, తలవైపు ప్రాంతంలో చిన్న గొయ్యి తవ్వడం ద్వారా మృతదేహాన్ని సులభంగా అందులోకి చేర్చవచ్చని రోజీ చెప్పుకొచ్చింది. కాగా, సమాధి విషయం కాస్తా అందరికీ తెలియడంతో స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొందరు ఏంటీ? వింత అనుకుంటుంటే మరికొందరు ఆమె చేసిన పని సరైనదేనని అంటున్నారు.

SHARE

LEAVE A REPLY